అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..?

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయ రథం ఆహుతి వెనుక అసలు ఏం జరిగింది..? దురదృష్టవశాత్తు జరిగిందా.. ఎవరైనా దుండగుల హస్తం ఉందా..? ఆలయంలోని సీసీ టీవీ కెమెరాలు పనిచేయకపోవడానికి గల కారణాలేంటి..? ఆలయ కమిటీ ఎందుకు పట్టించుకోలేరు..? ఇన్నేళ్లుగా లేని ప్రమాదం ఇప్పుడే ఎందుకు జరిగింది..? ఈ నిప్పు వెనుక దాగి ఉన్న ముసుగు వీరులెవరు..? పోలీసులు తమ విచారణలో వెల్లడైనట్లు చెబుతున్న తేనెతుట్టు కట్టుకథేనా..? అసలు అర్ధరాత్రి తేనెతుట్టల నుంచి తేనె తీయడం […]

Written By: NARESH, Updated On : September 8, 2020 3:29 pm
Follow us on


అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయ రథం ఆహుతి వెనుక అసలు ఏం జరిగింది..? దురదృష్టవశాత్తు జరిగిందా.. ఎవరైనా దుండగుల హస్తం ఉందా..? ఆలయంలోని సీసీ టీవీ కెమెరాలు పనిచేయకపోవడానికి గల కారణాలేంటి..? ఆలయ కమిటీ ఎందుకు పట్టించుకోలేరు..? ఇన్నేళ్లుగా లేని ప్రమాదం ఇప్పుడే ఎందుకు జరిగింది..? ఈ నిప్పు వెనుక దాగి ఉన్న ముసుగు వీరులెవరు..? పోలీసులు తమ విచారణలో వెల్లడైనట్లు చెబుతున్న తేనెతుట్టు కట్టుకథేనా..? అసలు అర్ధరాత్రి తేనెతుట్టల నుంచి తేనె తీయడం ఎలా సాధ్యం..? అర్ధరాత్రి ఆలయంలో అగ్ని ప్రమాదం ఏంది..? ఇవీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్న ప్రశ్నలు.

Also Read: ఎంత ఘోరం:పాడైపోయిన బీర్లు ఏపీ ప్రజలు తాగారా?

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహా స్వామి ఆలయ రథం ఆదివారం తెల్లవారు జామున మంటల బారిన పడి పూర్తిగా దగ్ధమైంది. సుమారు 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథం మంటల బారిన పడటం స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు. జిల్లాలోని సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో ఉంది ఈ ఆలయం. అంతర్వేది తిరునాళ్లుగా రాష్ట్రం మొత్తం గుర్తింపు పొందింది. అంతర్వేది ఆలయం వెలుపల నిర్మించిన షెడ్‌లో స్వామివారి రథాన్ని ఉంచుతారు. ఏటా స్వామివారి ఉత్సవాల సందర్భంగా.. ఈ రథాన్ని బయటికి తీసుకొస్తారు. ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. ఆదివారం 3 గంటల సమయంలో హఠాత్తుగా షెడ్‌లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల బారిన పడి రథం పూర్తిగా కాలిపోయింది.

6 దశాబ్దాల కిందట టేకు కలపతో చేసిన ఈ రథం ఇప్పుడు ఆకస్మాత్తుగా ఇలా అగ్నికి ఆహుతి కావడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అప్పట్లోనే రూ.94 లక్షల ఖర్చుతో పూర్తి టేకు కలపతో కనులు మిరుమిట్టు గొలిపే రీతిలో తయారైన ఈ రథాన్ని 57 ఏళ్ల నుంచి ఉత్సవాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆలయానికి సమీపంలోని ప్రత్యేక షెడ్డులో దీనిని భద్రపరిచారు. ఇంత చరిత్ర కలిగిన రథం ఒక్కసారిగా ఖాళీ బూడిదైంది. ఈ ప్రమాదానికి ముందుగా చెప్పినట్లుగా షార్ట్‌ సర్క్యూట్‌ కారణమనుకుంటే.. అక్కడి పరిస్థితులు దానిని నమ్మేలా లేవు. రథాన్ని పెట్టే షెడ్డులో విద్యుత్‌ సరఫరా కోసం ఒకట్రెండు బల్బుల మాత్రమే ఉన్నాయి. రథాన్ని దహనం చేసే స్థాయిలో ఓల్టేజీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read : చంద్రబాబు తపో భంగానికీ ఏపీ బీజేపీ పెద్ద ప్లాన్లు?

సడెన్‌గా ఈ ఘటన జరగడంపై ఇప్పటికే అన్నివర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇంత పెద్ద ఆలయంలో సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలూ పనిచేకపోవడంపై భక్తులు ఫైర్‌‌ అవుతున్నారు. అయితే.. ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ.మోహనరావు, జిల్లా ఎస్పీ నయీంఅస్మీ, ఫోరెన్సిక్‌ ఐజీ రాజేంద్ర ససేన్‌ పర్యవేక్షణలో పోలీసు ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోను విచారణ చేపట్టేందుకు ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం ఆలయంలోని సిబ్బంది, అర్చకులను వ్యక్తిగతంగా విచారిస్తుండగా మరో బృందం క్లూస్‌ను సేకరించే పనిలో ఉన్నారు. ఇంకో బృందం గ్రామస్తులను విచారిస్తున్నారు. మరో ప్రత్యేక బృందం ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలించే పనిలో ఉన్నారు.

మరోవైపు ఆలయ ఇన్‌చార్జి ఈవోను తప్పించాలనే లక్ష్యంతో కొందరు వ్యక్తులేమైనా ఇలాంటి వ్యూహాత్మక కుట్ర పన్నారా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కొందరు నియోజకవర్గ వైసీపీ నాయకులు సోమవారం దేవాదాయమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను కలిసినట్టు తెయడంతో.. వారి నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌తో ఆలయ ఇన్‌చార్జి ఈవో ఎన్‌ఎస్‌ చక్రధరరావుపై బదిలీ వేటు పడింది. దీంతో అధికార వైసీపీలో ఈవో వ్యవహారంపై కొంత కాలంగా ఇద్దరు కీలక నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో ఒకరిది పైచేయిగా మిగిలిందనే విమర్శలు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు దేవాదాయశాఖ కమిషనర్‌ భ్రమరాంబ కూడా అంతర్వేది చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు పనిచేయని తీరు, సిబ్బంది వ్యవహారశైలిపై విచారణ చేపట్టారు.

ఈ అగ్నిప్రమాద ఘటనపై రాజకీయ కుట్ర కోణం కూడా దాగి ఉండొచ్చనేది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నడుస్తున్న టాక్‌. ఘటన జరిగిన రోజున పిచ్చివాడి చర్యగాను.. నిప్పుల కుంపటి అని.. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అని ప్రచారం చేసిన పోలీసు యంత్రాంగం.. చివరకు శోధించి శోధించి ‘తేనెతుట్ట’ కారణంగానే జరిగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేయడంపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు మొదలయ్యాయి. రాజకీయ కుట్ర కోణం దాగి ఉండవచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రకోణాల వైపు వెళ్లకుండానే ‘తేనెతుట్ట’తోనే కేసు విచారణ ముగించేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read: అమరావతిని పూర్తిగా లేపేసేలా వైసీపీ ప్లాన్?

ప్రభుత్వ అధికారిక మీడియాలో అంతర్వేది రథం దగ్ధం వెనుక ‘తేనె సేకరణకు ప్రయత్నించే ముఠా కారణం’ అని నిర్ధారించడం ఇప్పుడు వివిధ రాజకీయ పక్షాల్లోనూ చర్చనీయాంశమైంది. రథం షెడ్డుకు ముందు భాగంలో 40 అడుగుల ఎత్తులో ఉండే భవనంపైన ఉన్న ఆ తేనెతుట్టను అర్ధరాత్రి వేళ తొలగించడం సాధ్యమా..? దానివల్ల తేనె సేకరించే వ్యక్తులకు వచ్చే ఆదాయం ఎంత..? ప్రాణాలను పణంగా పెట్టి తేనెపట్టుకోడానికి నాలుగంతస్తుల ఎత్తులో ఉన్న షెడ్డును ఎలా ఎక్కగలరు..? అలా ఎక్కి సురక్షితంగా తేనెపట్టు పట్టుకోగలరా..? అంటూ భక్తులు వేస్తున్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం లేదు. మరోవైపు మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులు వెల్లంపల్లి, విశ్వరూప్‌ను వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడే ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రుల వాహనాలను ముందుకు వెళ్లకుండా ఆపారు.

దీంతో ఈ తేనెతుట్ట ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం వాదనను భక్తులు కొట్టిపారేస్తున్నారు. దీనివెనుక ఏదో కుట్ర ఉందని దాన్ని వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే చర్యలపై ప్రభుత్వం ఉదాసీనత పనికిరాదని హితవు పలుకుతున్నారు.