బీజేపీకి తన పర భేదం లేదు. మనోడు, పగోడు అన్న తేడా అస్సలే లేదు. ఆశతో వచ్చినా.. అవసరం కోసం వచ్చినా కనికరించే పరిస్థితే లేదు. అందుకే ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీకి అవసరార్థం వచ్చిన ఎంపీ సుజనాచౌదరికి కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది.
రాజ్యసభలో బీజేపీకి బలం లేనప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు తన నలుగురు రాజ్యసభ ఎంపీలను పువ్వుల్లో పెట్టి బీజేపీలోకి పంపించారనే టాక్ రాజకీయవర్గాల్లో ఉంది. ఈ కేసులు కూడా వీరి మెడకు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ ఎంపీలుగా కొనసాగుతున్నారు.
అయితే బీజేపీలో చేరినా ఎంపీ సుజనా చౌదరికి ఊరట దక్కలేదు. తాజాగా గట్టి షాక్ తగిలింది. సుజనాచౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీన విచారణకు హాజరు కావాలని వాటిలో పేర్కొంది. డొల్ల కంపెనీలతో రూ.5700 కోట్ల మేర మోసం చేసినట్లు సుజనాపై అభియోగాలున్నాయి. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగానే ఆయనపై ఈడీ 2018లో తనిఖీలు చేసి కేసు పెట్టింది.
తాజాగా ఆయన 126 షెల్ కంపెనీలు సృష్టించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.
దీంతో ఈడీ కేసుల నుంచి సుజనా చౌదరి తప్పించుకునే చాన్స్ లేకుండా బీజేపీ ఉచ్చు బిగిసింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనాకు ఈ పరిస్థితి చూసి టీడీపీ ఎంపీలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.