
తెలంగాణ రాజకీయాల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న కేసీఆర్ తనకు ప్రత్యర్థులయ్యే వారిని ఎలా తొలగించుకోవాలో బాగా తెలుసు. తన పంటికింద రాయిలా మారిన వారిని ఎలా డమ్మీని చేయాలో తెలుసు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ను కుదేలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు బీజేపీని నమ్మించి ప్రజల్లో విశ్వసనీయత లేకుండా చేసే ప్లాన్ కు తెరతీశాడని స్వయంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు ఆరోపిస్తున్నారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీలో గెలవగానే తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రధాన పోటీదారుగా బీజేపీ నిలబడింది. దీన్ని నిలపడంలో సక్సెస్ అయ్యి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హీరోగా మారిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది.
అయితే బీజేపీ దెబ్బకు ఓడిపోయిన కేసీఆర్ మొదట్లో బీజేపీపై తొడగొట్టాడు. పాతాళంలోకి పడేస్తానని అన్నాడు. కానీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలతో ఢిల్లీ వెళ్లి మోడీషాలతో భేటి అయ్యి రాజీ కుదుర్చుకొని వచ్చాడు. ఈ క్రమంలోనే కేసీఆర్ సైలెంట్ అయ్యారు.
ఇప్పుడు ఈ పరిణామం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో ఓవైపు కేసీఆర్ దోస్తీ చేస్తుండడంతో రాష్ట్రంలో ఎలా ఫైట్ చేయాలో తెలియక ఆయన వెనకడుగు వేస్తున్నారు. ఒకవేళ ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయో తెలియదు కానీ.. కొద్దిరోజులుగా బండి సంజయ్ సైలెన్స్ అయ్యారు. దీన్ని బట్టి కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ దోస్తీ ఎఫెక్ట్ బండి సంజయ్ పై పడిందని.. ఆయన మౌనానికి కారణం అదేనని అంటున్నారు.