తెలంగాణలో నామినేటేడ్ పదవుల భర్తీ షూరు కానుంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటేడ్ పదవుల భర్తీపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే ప్రతీసారి ఏదోఒక కారణంతో వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెల్సిందే..!
ప్రభుత్వంఇప్పటిదాకా కేవలం ప్రాధాన్యం ఉన్న పోస్టుల మినహా మిగతా వాటిని భర్తీ చేయలేదు. దీంతో భారీగా నామినేటేడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే తాజాగా రాష్ట్ర మహిళా కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డిని నియమించింది. ఆమెతోపాటు మరో ఆరుగురు సభ్యులకు చోటు కల్పిండంతోపాటు ఐదేళ్ల కాలపరిమితిని విధించింది. దీంతో నామినేషన్ పోస్టులపై భర్తీపై నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ.. కార్పొరేషన్.. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలోపు నామినేటేడ్ పదవులను భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ లోని అసంతృప్తులను చల్లబరిచేలా నామినేటేడ్ పోస్టుల భర్తీ ఉంటుందని టాక్ విన్పిస్తోంది.
దీనిలో భాగంగా కార్పొరేషన్ చైర్మన్లు.. మార్కెట్ కమిటీ చైర్మన్లు.. డైరెక్టర్లతోపాటు ఇతర పదవుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 64 కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉండగా 50వరకు తొలివిడుతలో భర్తీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.