దేశంలో బంగారం ధర రోజురోజుకు పెరిగిపోతుంది. ఆరు నెలల క్రితం 10 గ్రాముల బంగారం 43,000 రూపాయలు పలకగా ప్రస్తుతం బంగారం ధర 53,000కు చేరింది. దీంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపట్లేదు. కొనాలనే ఆశ ఉన్నా పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉండటంతో వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో మాత్రం వర్షంలో బంగారం కురిసింది.
కర్ణాటక – తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన సర్జాపుర, భాగలూరులో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి నేలపై బంగారు నాణేలు పడ్డాయి. వినడానికి వింతగా అనిపించినా ఈ ఘటన నిజంగానే చోటు చేసుకుంది. క్షణాల వ్యవధిలోనే వర్షానికి బంగారం కురిసిందని ఊరిలోని ప్రజలందరికీ తెలియడంతో వాళ్లు కూడా బంగారు నాణేల కోసం వెతుకులాట ప్రారంభించారు. కొందరికి బురదనీటిలో నాణేలు లభించాయి.
ప్రజలకు దొరికిన ఆ నాణేలపై ఉర్దూ భాషలో అక్షరాలు ఉండటం గమనార్హం. పోలీసులు సమాచారం అందిన వెంటనే నాణేలు కనిపించిన ప్రాంతానికి వెళ్లి కొన్ని బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. బంగారు నాణేలపై గ్రామస్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు గ్రామస్తులు ఎవరో బంగారు నాణేలను భూమిలో పాతిపెడితే అవి వర్షానికి పైకి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.
మరి కొందరు మాత్రం బంగారు నాణేలు ఆకాశం నుంచే పడ్డాయని భావిస్తూ వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. బంగారు నాణేలు దొరికితే తమ కష్టాలు తీరతాయని భావిస్తున్నారు. మరి కొంతమంది గ్రామంలోని ఇతర ప్రాంతాల్లో బంగారు నాణేల కోసం వెతుకుతున్నారు. ఈ బంగారు నాణేల వెనుక మిస్టరీ వెలుగులోకి రావాల్సి ఉంది.