దేశ చరిత్రలో తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈరోజు పార్లమెంట్ కు ఆమె ఒక ట్యాబ్ ను పట్టుకొని రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నేళ్ల భారత పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి పేపర్ లెస్ గా ‘యాప్’లో బడ్జెట్ పత్రులను పెట్టారు. కాగితరహితంగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
చరిత్రలో తొలిసారి కరోనా కారణంగా ఈ ఏడాది బడ్జెట్ ప్రతుల ముద్రణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కూడా బడ్జెట్ ప్రతులకు బదులు ట్యాబ్ తో పార్లమెంట్ కు రావడం విశేషం.
అంతకుముందు రాష్ట్రపతిని కలిసి ఆయనకు బడ్జెట్ గురించి వివరించి నిర్మల పార్లమెంట్ కు చేరుకున్నారు. అయితే ప్రతీసారి బడ్జెట్ ప్రతులతో ఓ సూట్ కేసును చూపించే ఆర్థిక మంత్రులకు భిన్నంగా.. ఆ సంప్రదాయానికి స్వస్తి పలికిన నిర్మల మేడిన్ ఇండియా ట్యాబ్ తో కనిపించింది.
బడ్జెట్ ను ఈసారి యాప్ లో పెట్టారు. ఆ పీడీఎఫ్ ఫైల్ లనే అందరూ చూసి చదువుకోవాలని సూచించారు. నిర్మల కూడా పేపర్ లెస్ గా ట్యాబ్ ద్వారా ఈసారి బడ్జెట్ పద్దును తీసుకొస్తున్నారు.
ఈసారి పార్లమెంట్ సభ్యులు కూడా ఈ స్మార్ట్ బడ్జెట్ కు ఓకే చెప్పడంతో ప్రతుల ముద్రణ చేపట్టలేదు. అందుకు బదులుగా బడ్జెట్ సాఫ్ట్ కాపీలు ఇవ్వనున్నారు.