టాలీవుడ్ ఇండస్ట్రీకి కేరాఫ్.. హైదరాబాద్ నగరం. దేశంలో అత్యంత సురక్షిత ప్రాంతంగా పేరుగాంచిన హైదరాబాద్ ఇటీవల కురిసిన భారీవర్షాలకు సముద్రాన్ని తలపిస్తోంది. నగరంలోని కాలనీలన్నీ జలమయంగా మారిపోయాయి. గత రెండు మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: ‘రాధేశ్యామ్’పై కాపీ మరక.. కౌంటర్ ఇవ్వరా?
హైదరాబాద్లో నగరవాసులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. అయినప్పటికీ కొంతమంది నిరాశ్రయులుకాగా పదుల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకునేందుకు రూ.550కోట్లను ప్రకటించింది. సీఎం కేసీఆర్ సైతం వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతీఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ కదిలి వస్తోంది. పెద్దమొత్తంలో విరాళాలను ప్రకటించి సెలబ్రెటీలు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి ముందుగా కింగ్ నాగార్జున రూ.50లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్లు ప్రకటించాడు. స్టార్ హీరోలంతా తమవంతు సాయాన్ని ప్రకటిస్తూ బాధితులకు మేమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బాబులు చెరో కోటి రూపాయాలను సీఎం సహాయనిధికి ప్రకటించారు. క్లిష్టసమయంలో ప్రతీఒకరూ వీలైనంత వరకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ 50లక్షలు.. విజయ్ దేవరకొండ 10లక్షలు.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ 10లక్షల విరాళాన్ని ప్రకటించారు.
Also Read: టాలీవుడ్ బుట్టబొమ్మ.. బాలీవుడ్లో ‘సర్కస్’ చేయనుందా?
దర్శకులు అనిల్ రావిపూడి.. హరీష్ శంకర్ చెరో రూ.5లక్షలు విరాళంగా ప్రకటించారు. వీరితోపాటు మంచు లక్ష్మీ.. అక్కినేని సమంత వరద బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. కేసీఆర్ పిలుపుకు స్పందించి సెలబ్రెటీలు విరాళాలను ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ ట్వీటర్లో స్పందించారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి.. ప్రజలకు అండగా నిలిచి దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్ ప్రముఖులతోపాటు పలు రాష్ట్రాల సీఎంలు తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలను ప్రకటించారు.