
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్లకు సంబంధించి వస్తున్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం వైరస్‌లు మ్యుటేట్ చెందడం కొత్త కాదని, ప్రపంచంలోని ప్రతి వైరస్ కూడా మ్యుటేట్ చెందుతూనే ఉంటుందని చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ లు వేసుకుంటే భారీ వేరియంట్లు వచ్చినా ఏం కాదని వెల్లడిస్తున్నారు.
వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో వేస్తే 2024 నాటికి కరోనా వైరస్ పూర్తిస్థాయిలో కనుమరుగవుతుందని మ్యుటేట్ అయిన ప్రతిసారి వైరస్ కే ప్రయోజనం కలుగుతుందని చెప్పలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ మ్యుటేషన్ వల్ల ఒకసారే దానికి ప్రయోజనం కలగొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్త వేరియెంట్లు వస్తే ఏదో జరిగిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ కలిగి ప్రాణమున్న ప్రతి జీవిలో మ్యుటేషన్‌లు జరుగుతాయని ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లలో మ్యుటేషన్లు వేగంగా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొత్త వేరియెంట్లపై వ్యాక్సిన్లు పనిచేయవనే అపోహలను నమ్మవద్దని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోగలిగితే ఎన్ని రకాల వేరియెంట్లు వచ్చినా ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వైరస్ సోకినా లక్షణాలు కనిపించని వారిలో యాంటీబాడీలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 60 – 70 శాతం మంది వ్యాక్సిన్లు వేయించుకుంటే మూడో దశ వచ్చినా ఏమీ కాదని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.