
తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జూన్ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాలలో నగదు జమ చేయడానికి సిద్ధమైంది. ప్రభుత్వం ఒక్కో రైతుకు ఎకరాకు సీజన్ కు 5వేల రూపాయల చొప్పున ఖాతాల్లో నగదు జమ చేయనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జూన్ నెల 25వ తేదీలోగా రైతుల ఖాతాలలో ఈ నగదు జమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని 63,25,695 మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించామని తెలిపారు.
తెలంగాణ సర్కార్ ఈ పథకం కోసం ఏకంగా 7500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలుస్తోంది. రెవెన్యూ శాఖ అర్హుల పేర్లతో కూడిన తుది జాబితాను వ్యవసాయ శాఖకు ఇప్పటికే అందజేసింది. గత యాసంగి కంటే ఈ సీజన్ లో 2.81 లక్షల మంది రైతులకు అదనంగా అర్హత లభించింది. ఎవరైతే ఈ స్కీమ్ కు ఈ సీజన్ లోనే అర్హత పొందుతారో వాళ్లు స్థానిక ఏఈఓ, ఏఓలను కలవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఏఈఓ, ఏఓలకు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ తో పాటు పట్టాదార్ పాస్ బుక్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనం కావడం వల్ల ఐఎఫ్ఎస్‌సీకోడ్‌లు మారాయి. అయితే ఐఎఫ్ఎస్‌సీకోడ్‌లు మారడంపై రైతులు ఆందోళన చెందవద్దని ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,72,983 మంది రైతులు అర్హులు ఉన్నారని సమాచారం. తెలంగాణ సర్కార్ రైతుబంధు నగదును జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.