ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల పట్టును కోల్పోకుండా కాపాడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కానీ టీడీపీలోనే ఉన్న కొందరు నాయకులు మాత్రం సొంత పార్టీకే ఎసరు పెడుతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని పట్టించుకోకుండా తమదారి తామే అన్నట్లుగా ఉన్న ఆ నాయకులతో పార్టీ నేత చంద్రబాబుకు తలనొప్పులు తయారవుతున్నాయి. అయితే ఆయన దూకుడు ఏ విధంగా కళ్లెం వేయాలని ఇతర నాయకులు అవకాశం కోసం చూస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ టీడీపీ చేస్తున్న కామెంట్లు సొంత పార్టీకి దెబ్బ పడే అవకాశం ఉందన్ని తోటి తమ్ముళ్లు బాధపడుతున్నారు. ఇంతకీ ఎవరా నేతా..? ఏంటా కామెంట్లు..?
పంచాయతీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలిన టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లోనైనా కొన్ని చోట్ల పరువును కాపాడుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని సమావేశాల్లో పార్టీ నేత చంద్రబాబు సదరు నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే కొందరు నాయకులు దూకుడుగా ప్రవర్తించడంతో పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తుంది. ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ అభిమానిపై చేయి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే బాలకృష్ణకు ఇలాంటివి కొత్తేమీ కాకపోయిన మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇలాంటివి చోటు చేసుకోవడం పార్టీకి తీవ్ర నష్టమేనని స్థానిక నాయకులు వాపోతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపికి కంచుకోట. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ ప్రాబల్యం తగ్గలేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ పై ఇప్పుడు సైకిల్ పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. మొదటి నుంచి దూకుడుగా ఉన్న ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షానికి ఆయన చుక్కలు చూపించారు. ఇప్పుడు సొంత పార్టీకే తలనొప్పిగా మారాడని తెలుస్తోంది.
మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా ఏలూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థలను దింపకపోగా ఇతర పార్టీలకు మద్దతుగా ప్రచారం చేస్తానని ఆయన కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. బరిలో ఉన్న బీజేపీ, జనసేన అభ్యర్థులకు ప్రచారం చేస్తానని అన్నాడు. గతంలోనూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చింతమనేని ఇప్పుడు సొంతపార్టీకే ఎసరు పెట్టడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విషయంపై కొందరు చింతమనేనిని ప్రశ్నించగా టీడీపీ తరుపున అభ్యర్థులు లేరని ఆయనే అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో ఎన్నికలను చూసిన టీడీపీ ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ధాటికి తట్టుకోలేకపోతుంది. గత పంచాయతీ ఎన్నికల్లో వైపీపీ ఏకగ్రీవానికి మొగ్గు చూపడంతో టీడీపీ చాలా చోట్ల పోటీ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ అదే తంతు కొనసాగిస్తోంది. దీంతో కొన్ని చోట్ల పోటీ చేయడానికి టీడీపీ అభ్యర్థులు ముందుకు రావడం లేదు.
ఈ నేపథ్యంలో ఏలూరు కార్పొరేషన్లోని చింతమనేని ప్రభాకర్ పర్యవేక్షిస్తున్న 25వ డివిజన్ లోనే అభ్యర్థి లేకపోవడం గమనార్హం. దీంతో రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితే ఏంటోనని ఆ పార్టీ నాయకులు మదన పడుతున్నారు.