ఇప్పుడు టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత క్యూరియాసిటీని ఫిల్ చేస్తున్న మూవీ పవన్-క్రిష్ మూవీ. ఈ హిస్టారికల్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. సినిమా టైటిల్ నుంచి పవన్ గెటప్ వరకూ ప్రతిదీ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. అదే రెండో దర్శకుడు. ఈ చిత్రానికి క్రిష్ తో పాటు మరో దర్శకుడు వర్క్ చేయబోతున్నాడన్న న్యూస్ వైరల్ అయ్యింది. ఇంతకీ ఆయన ఎవరు? రెండో దర్శకుడిని ఎందుకు తీసుకుంటున్నారని హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొదలు సామాన్య ప్రేక్షకుల వరకూ డిస్కస్ చేసుకుంటున్నారు.
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ టేకింత్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి దర్శకుడు పవన్ తో సినిమా అనౌన్స్ చేసే సరికి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అది కూడా పీరియాడికల్ డ్రామా కావడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. 15 శతాబ్దం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామాలో.. పవన్ బందిపోటు దొంగ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ పరిశీలిస్తున్న విషయం కూడా తెలిసిందే.
పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతున్న ఈ మూవీని.. దాదాపు 170 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించబోతున్నారు. పీరియాడికల్ మూవీ కాబట్టి నాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా లొకేషన్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలో చార్మినార్, గండికోట సంస్థానం సెట్లను సిద్ధం చేశారు కూడా. ఇంకా పలు చారిత్రక ప్రదేశాల సెట్లు కూడా నిర్మించనున్నారు. ఈ విధంగా ప్రతీ విషయంలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్న ఈ చిత్రానికి రెండో దర్శకుడు కూడా పనిచేయబోతున్నాడన్న వార్త సంచలనంగా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం.. సెకండ్ డైరెక్టర్ ను రంగంలోకి దించడం కన్ఫాం అయ్యిందట. దీనికి కారణం ఏమంటే.. ఇదో చారిత్రక సినిమా కావడంతో వీఎఫ్ ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఫినిష్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇటు దృష్టిపెట్టాలంటే.. అటు సినిమా షూటింగ్ ఆగిపోతుంది. ఇవన్నీ ఒక్కరే చేయాలంటే.. సినిమా పూర్తయ్యే సరికి ఎంత కాలం పడుతుందో కూడా చెప్పడం కష్టం. అందుకే.. రెండో దర్శకుడిని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట.
ఇందుకు పవన్ కూడా ఓకే చెప్పేశారట. సెకండ్ డైరెక్టర్ వచ్చిన తర్వాత రెండు యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఒక యూనిట్లో ఒక సీన్ షూట్ చేస్తుంటే.. మరో యూనిట్లో ఇంకో సన్నివేశాన్ని తెరకెక్కిస్తారు. అలా త్వరగా సినిమాను కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే.. పెద్ద సినిమాలకు ఇలా చేయడం సాధారణ విషయమే. రాజమౌళి సినిమాల్లోకూడా సెకండ్ యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ కు ఆయన కుమారుడే సారథ్యం వహిస్తాడు. కానీ.. ఇలాంటి విషయాలను బయటకు చెప్పరు.
అయితే.. క్రిష్ సినిమాకు వచ్చేది ఇప్పటికే దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి కావడంతో బయటకు ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఇంతకీ ఆయన ఎవరంటే.. బాబు బాగాబిజీ, కమిట్ మెంట్ చిత్రాల దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా ఈ సెకండ్ యూనిట్ ను లీడ్ చేయనున్నట్టు సమాచారం. పవన్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ మూవీని ఎలా డిజైన్ చేయబోతున్నారో చూడాలి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రామ్ పాల్ ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు.