Govt Schemes : రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా పేదలకు అందుబాటులోకి పలు పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వారికి లబ్ధి చేకూర్చడం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ బెనిఫిట్స్ అందిస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే కేంద్రం అమలు చేస్తున్న ఓ పథకం గురించి తెలుసుకుందాం.
సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వాలు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే స్కీమ్ ను సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా దేశంలోని పేదలకు అండగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుత రోజుల్లో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరంగా మారిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అనుకోని పరిస్థితుల వలన కుటుంబ యజమాని మరణిస్తే.. ఆ కుటుంబానికి ఆర్థికపరమైన భరోసా కల్పించేదే లైఫ్ ఇన్సూరెన్స్. ఈ క్రమంలోనే దేశంలోని పేద ప్రజల కోసం ఆలోచన చేసిన కేంద్ర సర్కార్ 2015 వ సంవత్సరంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ పథకం ద్వారా రూ.20 కనీస ప్రీమియంతో రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. మీకు కనుక బ్యాంక్ అకౌంట్ ఉంటే సదరు బ్రాంచ్ కు వెళ్లి ఫామ్ పిల్ చేసి ఈ పథకంలో చేరవచ్చు. లేదంటే మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా కూడా ఈ పాలసీని పొందే అవకాశం ఉంది. ‘ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన’ పథకాన్ని తీసుకోవాలనుకునే వారు ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్సించాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఈ పథకానికి లింక్ అయి ఉండటం వలన .. బ్యాంక్ ఖాతా నుంచే రూ.20 కట్ అవుతాయి. ఈ మేరకు ప్రతి సంవత్సరం మే 31న ఈ నగదు బ్యాంకు ఖాతా నుంచి కట్ అయ్యే ఛాన్స్ ఉంది.
అయితే కేవలం ఒక్క బ్యాంక్ అకౌంట్ ను మాత్రమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు లింక్ చేయాలి. ప్రీమియం డబ్బులు చెల్లిస్తేనే పాలసీ రెన్యూవల్ కూడా అవుతుంది. లేని పక్షంలో పాలసీ రద్దు అవుతుంది. కాగా 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. అయితే పాలసీదారు ప్రమాదవశాత్తు చనిపోతే.. రూ. 2 లక్షల బీమా మొత్తాన్ని కుటుంబానికి అందిస్తారు. ఒకవేళ ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ. లక్ష చెల్లిస్తారు. ఈ విధంగా స్కీమ్ ద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది.
సామాన్య ప్రజలు చాలా వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. దీనికి ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ వచ్చే విధంగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాదు దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పథకంలో సుమారు 35 కోట్ల మంది చేరారని సమాచారం.