Employee Behavior: ఒక కంపెనీ ఎదుగుదలలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా తమ పనిని కేవలం ఉద్యోగ బాధ్యతగా కాకుండా.. సంస్థ అభివృద్ధిలో భాగంగా భావించే ఉద్యోగులు కంపెనీకి ఎంతో విలువైనవారు. ఇలాంటి ఉద్యోగులు సమస్యలను ముందుగానే గుర్తిస్తారు. కొత్త ఆలోచనలు చెబుతారు. తప్పులు జరిగితే ప్రశ్నిస్తారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి మంచి ఉద్యోగి ఒక్కసారిగా సైలెంట్‌గా మారిపోతాడు. పని మాత్రం చేస్తాడు.. కానీ అంతకుముందులా ఆసక్తి చూపించడు. అందుకు కారణాలేంటి? ఇలా ఉండే ఆ కంపెనీకి నష్టమా?
మంచి ఉద్యోగి సైలెంట్ అయినప్పుడు మొదట కనిపించే లక్షణం పని చేస్తాడు. కానీ శ్రద్ధ చూపడు. గతంలో ఉన్నంత ఆసక్తి కనిపించదు. ఇది నా పని కాదు.. అని చెప్పకపోయినా.. సంస్థ కోసం అదనంగా ఆలోచించే ప్రయత్నం తగ్గిపోతుంది. అంటే ఉద్యోగి పనితీరు పూర్తిగా పడిపోకపోయినా.. అతని అదనపు విలువ మాత్రం తగ్గుతుంది.
మంచి ఉద్యోగి సంస్థలో సమస్యను గుర్తిస్తే సాధారణంగా వెంటనే మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్తాడు. ఇక్కడ ఇలా చేస్తే సమస్య రావచ్చు.. అని హెచ్చరిస్తాడు. కానీ ఒక దశలో అదే ఉద్యోగి సమస్యను చూసినా స్పందించకుండా ఉండటం మొదలుపెడతాడు. ఇలాంటి సమయంలో మనకెందుకులే.. ఎవరు అడిగితే వాళ్లే చూసుకుంటారు.. అనే ధోరణి వస్తుంది.
ఒక సంస్థకు ఉద్యోగులు పని వేగంగా ఎలా చేయాలి? ఖర్చు ఎలా తగ్గించాలి? కస్టమర్లకు మెరుగైన సేవ ఎలా అందించాలి? కొత్త ప్రాజెక్టులను ఎలా అభివృద్ధి చేయాలి? వంటి ప్రశ్నలపై వారు ఆలోచిస్తుంటారు. కానీ సైలెంట్ అయిన తర్వాత ఉద్యోగి తనకు అప్పగించిన పని మాత్రమే చేస్తాడు. కొత్త ఆలోచన వచ్చినా చెప్పడు. ఎందుకంటే గతంలో తన సలహాలకు విలువ ఇవ్వకపోవడం.. తన మాటను పట్టించుకోకపోవడంతో ఈ మార్పుకు కారణం కావచ్చు.
మంచి ఉద్యోగి టీమ్‌లో ఎవరి తప్పు కనిపించినా దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తాడు. అవసరమైతే సహోద్యోగులకు చెబుతాడు. కానీ సైలెంట్ అయిన ఉద్యోగి వాళ్ల పని వాళ్లు చూసుకుంటారు.. అనే ధోరణిలోకి వెళ్లిపోతాడు. టీమ్‌లో తప్పులు జరుగుతున్నా పట్టించుకోడు. దీంతో టీమ్ నాణ్యతను మెరుగుపరిచే వ్యక్తి తన సహకారాన్ని తగ్గించినట్లే.
ఎక్కువ ప్రశ్నలు అడగని, వాదించని, ప్రతి విషయాన్ని ప్రశ్నించకుండా చెప్పిన పని మాత్రమే చేసే ఉద్యోగి కొంతమంది మేనేజర్లకు సులభంగా అనిపించవచ్చు. సమావేశాల్లో వాదనలు ఉండవు. నిర్ణయాలపై ప్రశ్నలు రావు. అదనపు చర్చలు ఉండవు. బయటకు చూస్తే టీమ్ చాలా కంఫర్టబుల్ గా నడుస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడూ మంచి లక్షణం కాదు. ఉద్యోగి ప్రశ్నించడం మానేశాడంటే.. సమస్యలు కూడా లేవని అర్థం కాదు.
అయితే సైలెంట్ అయిన ఉద్యోగి వల్ల కంపెనీకి వెంటనే నష్టం కనిపించకపోవచ్చు. కానీ సంస్థ కోల్పోయేది అతని డిస్క్రెషనరీ ఎఫర్ట్.. అంటే ఉద్యోగ వివరణలో లేకపోయినా సంస్థ కోసం స్వచ్ఛందంగా చేసే అదనపు కృషి. సమస్యను ముందుగానే గుర్తించడం.. వంటి వాటి విలువను కొలవడం కష్టం. కానీ ఇవే సంస్థను ముందుకు నడిపించే అంశాలు.