Life Story: జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ సమాజ పరిస్థితులు అనుకూలంగా ఉన్నవారు మాత్రమే అనుకున్న స్థాయికి వెళ్లగలుగుతారు అని కొందరు నిపుణులు చెబుతారు. మరికొందరు మాత్రం సమాజం ఎలా ఉన్నా ఎవరికి వారు తమ ఆలోచనలు వృద్ధి చేసుకోవడం ద్వారా అనుకున్నది సాధించగలుగుతారు అని చెబుతారు. మిగతా ప్రాణుల కంటే మనిషికి మెదడు సక్రమంగా పనిచేస్తుంది. అందుకే అత్యంత తెలివితో ప్రపంచాన్ని ఏలగలుగుతున్నాడు. అలాంటప్పుడు జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని అనుకున్న వారు కాస్త ఆలోచించి పనులు చేయాలని అంటున్నారు. అయితే కొందరు ఎంత చెప్పినా వినకుండా మోసపోతూనే ఉంటారు. ఇలా మోసపోకుండా ఉండాలంటే ఈ గాడిద స్టోరీని వినాల్సిందే..
Also Read: బిడ్డకు జన్మని ఇవ్వడం గొప్ప కాదట..ఇలాంటి మనుషులు కూడా ఉంటారా!
అడవికి రాజు సింహం అన్న విషయం అందరికీ తెలిసిందే. తనకు ఆకలేసినప్పుడు ఏదైనా జంతువు కనిపిస్తే విడిచిపెట్టి అవకాశమే లేదు. అయితే ఒకసారి తనకు దారిలో నక్క కనిపిస్తుంది. తనతో సింహం ఇలా అంటుంది. నాకు బాగా ఆకలి వేస్తుంది.. ఏదైనా జంతువును తీసుకొస్తే నిన్ను విడిచిపెడతా.. అని చెబుతుంది. దీంతో నక్క అడవిలో జంతువుల కోసం వెతుకుతుండగా గాడిద కనిపిస్తుంది. గాడిద దగ్గరికి వెళ్లిన నక్క.. సింహం నిన్ను రాజులు చేయాలని అనుకుంటున్నాడు.. నిన్ను తీసుకు రమ్మన్నాడు.. అని గాడిదతో అంటుంది. నక్క మాటలు విన్న గాడిద దాని వెంట సింహం వద్దకు వెళుతుంది. గాడిదని చూడగానే సింహం వేటాడుతుంది. అయితే గాడిద చెవులను సింహం కొరికేస్తుంది. కానీ ఎలాగోలా తప్పించుకుంటుంది.
మరోసారి గాడిదకు నక్క కనిపిస్తుంది. ఏంటి అలా నువ్వు అబద్ధం చెప్పావు అని అడిగితే.. అదేం లేదు నీకు కిరీటం పెట్టాలి కదా.. అందుకే సింహం నీ చెవులను తీసేసింది.. ఇప్పుడు మళ్లీ రమ్మంటుంది రా అని తీసుకెళ్తుంది. నక్క మాటలు మరోసారి నమ్ముతుంది గాడిద. ఈసారి సింహం దాడి చేసి తోకను తింటుంది. అయినా మరోసారి తప్పించుకొని నక్క వద్దకు వెళుతుంది. ఇప్పుడు మళ్లీ నక్కతో మోసం ఎందుకు చేశావు అని అడిగితే.. నీవు కుర్చీలో కూర్చోవడానికి తోక వడ్డం వస్తుంది.. అందుకే తోకను తీసేసింది అని చెబుతుంది. ఈసారి కూడా మాయమాటలు చెప్పి గాడిదని తీసుకెళ్తుంది నక్క.
అయితే మూడోసారి సింహం వద్దకు వెళ్లిన గాడిదపై దాడి చేసి చంపి తింటుంది. ఆ తర్వాత సింహం నక్కతో ఇలా అంటుంది.. గాడిదలోని కాలేయం, మెదడు తీసుకొని రా అని పక్కకు వెళ్తుంది. అయితే నక్క కాలేయ మాత్రమే తీసుకెళ్తుంది.. మెదడు ఏది అని అడగగా.. గాడిదకు మెదడు లేదు అని చెబుతుంది..
ఈ కథ తెలిపే నీతి ఏంటంటే.. ఒకసారి మోసపోవడం తెలియని తనం.. మరోసారి మోసపోవడం అమాయకత్వం.. మూడోసారి కూడా మోసపోవడం మూర్ఖత్వం.. ఎప్పుడూ ఒకే వ్యక్తి మాటలు నమ్మకుండా ఎవరికివారు ఆలోచించి పనులు చేయాలి. ప్రతిసారి ఇతరులపై ఆధారపడితే జీవితం కూడా గాడిదలాగే మారుతుంది. అందువల్ల సొంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయాల వల్ల ఒకసారి తప్పు జరగవచ్చు. కానీ మరోసారి కచ్చితంగా సరైన నిర్ణయమే తీసుకుంటారు.