Loans on your Pan card: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆధార్, పాన్ కార్డులు అందరికీ ముఖ్యమైన ఐడెంటిటీ డాక్యుమెంట్లుగా మారిపోయాయి. అయితే, వీటిని దుర్వినియోగం చేసే అవకాశం కూడా పెరిగింది. మోసగాళ్లు మీ ఆధార్, పాన్ వివరాలను దొంగిలించి, వాటిని ఉపయోగించి మీ పేరుతో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, లోన్లు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు పొందడం వంటి ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల వల్ల మీకు తెలియకుండానే చిక్కుల్లో పడుతారు. అంతేకాదు, మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతినవచ్చు. భవిష్యత్తులో మీకు నిజంగా లోన్ అవసరమైనప్పుడు అది దొరక్కపోవచ్చు. కాబట్టి, మీ పాన్, ఆధార్ వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పర్మిషన్ లేకుండా మీ పాన్ వివరాలను ఎవరైనా వాడుకుంటున్నారో లేదో తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ పాన్ వివరాలు దుర్వినియోగం అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఉన్న ఈజీ మార్గం మీ క్రెడిట్ రిపోర్టును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం. మీ క్రెడిట్ రిపోర్టులో మీ పాన్ నంబర్‌కు సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలు ఉంటాయి. అంటే, మీ పేరు మీద ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్స్, మీరు తీసుకున్న లోన్స్, క్రెడిట్ కార్డులు వంటి సమాచారం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రిపోర్టును తప్పకుండా గమనిస్తూ ఉండాలి.
ప్రస్తుతం దేశంలో నాలుగు ప్రధాన క్రెడిట్ ఏజెన్సీలు ఉన్నాయి. అవి సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సిఆర్‌ఐఎఫ్ హైమార్క్. ఇవి ప్రభుత్వం గుర్తించిన క్రెడిట్ బ్యూరోలు. భారతదేశంలో సిబిల్ ఎక్కువగా ఉపయోగించినప్పటికీ పైన చెప్పిన నాలుగు సంస్థలలో దేని నుంచైనా మీరు మీ క్రెడిట్ రిపోర్టు పొందవచ్చు. ఈ క్రెడిట్ బ్యూరోల అధికారిక వెబ్‌సైట్‌లకు వెళ్లి రిపోర్టును పొందవచ్చు. లేదా, ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్‌లలో, అలాగే మీ బ్యాంక్ యాప్‌లలో కూడా క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేయడానికి లింకులు అందుబాటులో ఉంటాయి. మీ పాన్ నంబర్, మొబైల్ నంబర్ ఉపయోగించి మీ క్రెడిట్ రిపోర్టును పొందవచ్చు. ప్రతి క్రెడిట్ ఏజెన్సీ నుంచి మీరు ఏడాదికి ఒకసారి ఫ్రీగా క్రెడిట్ రిపోర్టును పొందడానికి అవకాశం ఉంది.
క్రెడిట్ స్కోర్ అనేది వేరు, క్రెడిట్ రిపోర్ట్ అనేది వేరు. క్రెడిట్ స్కోర్‌లో కేవలం 300-900 మధ్య ఉన్న ఒక అంకె మాత్రమే ఉంటుంది. కానీ, క్రెడిట్ రిపోర్టులో మీ అన్ని ఆర్థిక లావాదేవీల పూర్తి వివరాలు స్పష్టంగా ఉంటాయి. మీ క్రెడిట్ రిపోర్టును చూసినప్పుడు కొన్ని విషయాలపై దృష్టిపెట్టాలి. మీరు తీసుకున్న లోన్స్, క్రెడిట్ కార్డుల గురించి మీకు కచ్చితంగా తెలుసు. అవి కాకుండా, మీకు తెలియని ఏవైనా ఇతర లోన్స్ లేదా క్రెడిట్ కార్డులు మీ పేరు మీద నమోదయ్యాయా అని జాగ్రత్తగా చూడండి. అలాగే మీకు తెలియని బ్యాంక్ అకౌంట్స్ మీ పాన్ నంబర్‌కు లింక్ అయి ఉన్నాయా అని చెక్ చేయండి.
మీ అనుమతి లేకుండా క్రెడిట్ బ్యూరోలకు ఏవైనా ఎంక్వైరీలు జరిగాయా లేదా అనేది తెలుసుకోవాలి. సాధారణంగా మీరు లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు మాత్రమే ఇటువంటి ఎంక్వైరీలు జరుగుతాయి. పైన చెప్పిన వాటిలో ఏవైనా మీకు తెలియకుండా నమోదై ఉంటే, మీ పాన్ నంబర్‌ను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారని అర్థం.
ఒకవేళ మీ పేరు మీద మీ పర్మీషన్ లేకుండా ఎవరైనా లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకున్నట్లు తెలిస్తే వెంటనే ఆ ఆర్థిక సంస్థ లేదా బ్యాంకుకు సమాచారం అందించాలి. మీ క్రెడిట్ రిపోర్టులో మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత క్రెడిట్ బ్యూరో కు ఫిర్యాదు చేయాలి. అలాగే వెంటనే దగ్గర్లోని సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద ఒక ఫిర్యాదు చేయాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుకోవచ్చు.