Homeక్రీడలుIND vs AUS : ఇండియా ఇండోర్‌లో చేతులెత్తేయడానికి కారణాలనేకం! సరిదిద్దుకోకపోతే తప్పదు భారీ మూల్యం

IND vs AUS : ఇండియా ఇండోర్‌లో చేతులెత్తేయడానికి కారణాలనేకం! సరిదిద్దుకోకపోతే తప్పదు భారీ మూల్యం

IND vs AUS : ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్టే.. గెలుపు నుంచి కూడా మన లోపాలు ఏంటో తెలుసకోవాలేమో! ఎందుకుంటే నాగ్‌ పూర్‌, ఢిల్లీలో గెలిచిన ఇండియా.. ఇండోర్‌లోకి వచ్చే సరికి చేతులు ఎత్తేసింది. ఆస్ట్రేలియా చేతిలో దారుణమైన పరాజయన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఛటేశ్వర్‌ పుజారా 59 పరుగులు కనుక చేయకుండా ఉంటే భారత్‌ ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయేదే. కనీసం ప్రత్యర్థి ముందు ఓ 150 పరుగుల స్కోరు ఉంచినా గెలుపు మీద ఆశలు ఉండేవి. 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచి గెలుస్తామని ఎలా అనుకున్నారో రోహిత్‌ సేనకే తెలియాలి.

ఆ స్పిన్ మంత్రం తోనే..

తొలి రెండు టెస్టులు స్పిన్‌ మంత్రంతో గెలిచిన ఇండియా.. మూడో టెస్ట్‌కు వచ్చేసరికి అదే స్పిన్‌ ఉచ్చులో పడి విలవిలలాడింది. మరీ ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ లాంటి బ్యాట్స్‌ మెన్‌ కునెమాన్‌, మర్ఫీ, లయాన్‌ బౌలింగ్‌లో కనీసం బంతిని బ్యాట్‌తో ఆడేందుకే ఇబ్బంది పడ్డాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయ్యర్‌, తొలి ఇన్నింగ్స్‌లో పుజారా, గిల్‌, రోహిత్‌ శర్మ, రవీంద్రజడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ ఏ ఒక్క బ్యాట్స్‌ మెన్‌ సరిగ్గా ఆడలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. వీరికి కొత్త కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ కూడా జతయ్యాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఇదేం నిర్ణయం

అసలు ఇండోర్‌ లాంటి పిచ్‌ మీద టాస్‌ గెలిచిన తర్వాత ఎవరైనా సరే ముందు బౌలింగ్‌ ఎంచుకుంటారు. కానీ రోహిత్‌ శర్మ మాత్రం మరోమాట లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయమే భారత్‌ కొంప ముంచింది. మైదానం మీద తేమ ఉండటంతో ఆసీస్‌ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్‌ చేశారు. కునేమాన్‌, ముర్ఫీ, లయాన్‌ స్పిన్‌ మంత్రానికి భారత్‌ బ్యాటింగ్‌ దళం బెంబేలెత్తిపోయింది. ఏ ఒక్కరు కూడా క్రీజులో కుదురుకులేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో పుజార తప్ప ఏ ఒక్క బ్యాట్స్‌ మెన్‌ కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ సాధించలేదు. అసలు ఇండోర్‌ కన్నా ముందు ఽధర్మశాల మైదానాన్ని ఎంపిక చేశారు. తర్వాత ఏమైందో కానీ మేనేజ్‌ మెంట్‌ ఆగమేఘాల మీద ఇండోర్‌ను ఎంచుకుంది. అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంది.

అసలు జట్టు కూర్పు సక్రమంగా ఉందా?

అసలు జట్టు కూర్పు సక్రమంగా ఉండటం లేదు. గత రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో అది కన్పించినా మేనేజ్‌మెంట్‌ పెద్దగా పట్టించుకోలేదు. మూడో టెస్ట్‌లో గిల్‌, ఉమేష్‌ యాదవ్‌ను తీసుకున్న మేనేజ్‌మెంట్‌ ఆరో బ్యాట్స్‌ మెన్‌ వైపు దృష్టి సారించలేదు. ఇదే జట్టు విజయావకాశాలను దెబ్బ తీసింది. ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్‌ చేసిన నేపథ్యంలో టాప్‌ ఆర్డర్‌ పేక మేడలా కూలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరాజ్‌ లేదా ఇంకో ఫాస్ట్‌ బౌలర్‌కు విశ్రాంతి ఇచ్చి సూర్య కుమార్‌కు అవకాశం ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

కాచుకున్నారు..

మొదటి రెండు టెస్ట్‌ల్లో భారత బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌ మెన్‌ మూడో టెస్ట్‌లో అటాకింగ్‌ ఆటతీర ప్రదర్శించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా బౌలింగ్‌ను ధాటిగా కాచుకున్నారు. మొదటి రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో చాలా సేపటి వరకు రవిచంద్రన్‌కు రోహిత్‌ బౌలింగ్‌ ఇవ్వలేదు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌ మెన్‌ ధారాళంగా పరుగులు తీశారు. ఇక జడేజా మీద అతి నమ్మకం పెట్టుకున్న రోహిత్‌ రెండు రివ్యూలు వృథా చేశాడు. ఇది కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లకు అనుకూలంగా మారింది. ఫలితంగా వారు తొలిరోజే ఆధిపత్యంలోకి వచ్చారు.

ఆహ్మదాబాద్‌లో గెలవాల్సిందే

ఇండోర్‌లో ఓటమి తర్వాత భారత జట్టు మీద ఒత్తిడి పెరిగిపోయింది. అహ్మదాబాద్‌లో జరిగే నాలుగో టెస్ట్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌ గెలిస్తేనే టెస్టుల్లో భారత్‌ నంబర్‌ వన్‌ ర్యాంకుకు ఢోకా ఉండదు. మరో వైపు ఐసీసీ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ ఫైనల్లోకి దూసుకెళ్తుంది. లేకంటే ఇండోర్‌ లో లాంటి ఆటతీరు ప్రదర్శిస్తే అంతే సంగతులు. మరి నాలుగో టెస్ట్‌కు మేనేజ్‌మెంట్‌ ఎలాంటి మార్పులు చేస్తుందో వేచి చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular