March 31st: మార్చి 31లోపు చేయాల్సిన పనులు ఏంటి అనుకుంటున్నారా? అవునండి.. ఈ నెలాఖరులోపు చేయాల్సిన పనులే.. ఎందుకంటే 2024 మార్చితో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లించేవారు తమ తమ ఆర్థిక బాధ్యతలను ఈ నెల 31 వ తేదీ లోపు పూర్తి చేయడం తప్పనిసరన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ నిర్ణీత సమయంలో కనుక పనులను పూర్తి చేయని పక్షంలో అపరాధ రుసుం కట్టాల్సి రావడమేకాకుండా చట్టపరమైన చర్యలను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో మార్చి 31 లోపు చేయాల్సిన పనులెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డాక్యుమెంట్స్ అప్ డేట్ల నుంచి ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్ మెంట్స్ వరకు వివిధ కీలక పనులకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందస్తుగా ఇటువంటి పనులను పూర్తి చేసుకోవడం మంచింది.
ముందుగా బ్యాంకుల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు లేకపోతే వెంటనే అప్ డేట్ చేసుకోవాలి. ఐటీ రిటర్న్, అప్ డేటెడ్ రిటర్నులను దాఖలు చేయాలి. దాంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తున్న వారు ఎవరైనా ఉంటే రీకేవైసీ పూర్తి చేసుకోవాలి. అంతేకాకుండా గృహరుణాలపై పలు బ్యాంకులు ఇస్తున్న ప్రత్యేక రాయితీలన్నీ ఈ నెల 31 వరకే అందుబాటులో ఉంటాయి.
అదేవిధంగా ఎస్బీఐ అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి ముగియనుంది. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ‘వన్ వెహికల్ వన్ ఫాస్ట్ ట్యాగ్ ’ ఇనిషియేటివ్ గడువును ఈనెలాఖరు వరకు పొడిగించింది. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన రిజిస్ట్రేషన్ కు కూడా ఈనెలాఖరు వరకే సమయం ఉంది. ఈ పథకం 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులకు వన్ టైమ్ కాంట్రిబ్యూషన్ ఆధారంగా స్థిరమైన ఇన్ కమ్ ను అందిస్తుంది. సుమారు 7.4 శాతం వార్షిక వడ్డీరేటుతో పదేళ్ల కాలవ్యవధిలో ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది.