New Zealand vs Pakistan Semi Final 2022: అది 2007 సంవత్సరం. టి20 మెన్స్ వరల్డ్ కప్ ప్రారంభమైన సంవత్సరం. న్యూజిలాండ్, పాకిస్తాన్ సెమిస్ లో తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టుతో తలపడింది. చివరి నిమిషంలో తడబడి కప్ భారత్ కు అప్పగించింది.. 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే ఫలితం నమోదయింది. ఈ టోర్నీ ప్రారంభించి పడుతూ లేస్తూ సాగిన పాకిస్తాన్ ప్రయాణం ఇప్పుడు ఫైనల్ చేరింది.

పాపం న్యూజిలాండ్
ఈ టోర్నీ ప్రారంభంలో బలవంతమైన ఆస్ట్రేలియా జట్టును గురించి హాట్ ఫేవరెట్ గా న్యూజిలాండ్ నిలిచింది. గ్రూప్ నుంచి నాకౌట్ వరకు ఒక్క జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రమే ఓడిపోయి సెమీ ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంకలపై గెలిచి అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రస్థానం కిందా మీదా పడుతూ సాగింది. భారత్, జింబాబ్వే చేతిలో ఓడిపోయి అనుహ్యంగా పుంజుకున్నది. ఎప్పుడైతే భారత్, జింబాబ్వే చేతిలో ఓడిందో అప్పుడే ఆ దేశ అభిమానులు ఆ జట్టు పై ఆశలు వదిలేసుకున్నారు. టోర్నీ నుంచి బయటకు వెళ్లాల్సిన జట్టు నెదర్లాండ్స్ సాధించిన విజయంతో ఊహించిన రీతిలో నాకౌట్ దశలో అడుగు పెట్టింది. ఇదే ఉత్సాహంతో బంగ్లాదేశ్ పై గెలిచింది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న న్యూజిలాండ్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మైదానంలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడగా అందులో కివీస్ రెండు గెలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచి న్యూజిలాండ్ రికార్డ్ ను సమం చేసింది.
న్యూజిలాండ్ తడబడింది
ఈ టోర్నీలో అన్ని జట్ల కంటే బలంగా కనిపించిన న్యూజిలాండ్ నాకౌట్ దశలో తేలిపోయింది. టాప్ బౌలర్లుగా పేరుపొందిన సౌదీ, ఫెర్గ్యూసన్ నాకౌట్ మ్యాచ్లో ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయారు. పైగా బాబర్ ఇచ్చిన క్యాచ్ ని కీపర్ వదిలేయడం వల్ల మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ మెరుగైన ప్రదర్శన చేసింది.. కానీ నాకౌట్ మ్యాచ్లో మాత్రం ఓపెనర్లు నిరాశపరిచారు. 180 పై చిలుకు స్కోర్ సాధిస్తుంది అనుకున్న దశలో 152 పరుగులు మాత్రమే చేసింది. విలియమ్సన్, మిచెల్ కనుక నిలబడి ఉండకుంటే న్యూజిలాండ్ స్కోర్ దారుణంగా ఉండేది.

ఓపెనర్లు నిలబడ్డారు
అనుశ్చితికి మారు పేరైన పాకిస్తాన్ క్రికెట్లో తమదైన రోజు వస్తే వారిని ఎవరూ ఆపలేరు. బహుశా ఈ రోజు కూడా అదే జరిగింది. ఎందుకంటే టోర్నీ ప్రారంభం నాటి నుంచి ఏ ఒక్క మ్యాచ్లో ఆకట్టుకొని బాబర్, రిజ్వాన్ ఈ మ్యాచ్లో నిలబడ్డారు. తొలి వికెట్ కు ఏకంగా 100 పైచిలుకు పరుగులు నమోదు చేశారు. అప్పటికే న్యూజిలాండ్ జట్టుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా న్యూజిలాండ్ ఫేలవమైన ఫీల్డింగ్ కారణంగా పాకిస్తాన్ క్రికెటర్లు బతికిపోయారు. లేకుంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. పాకిస్తాన్ గెలుపు చివరి అంచులు దాకా వచ్చిన తర్వాత ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు. అప్పటికే న్యూజిలాండ్ చేతులు ఎత్తేసింది. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ దర్జాగా ఫైనల్ లో అడుగుపెట్టింది. వాస్తవానికి పాకిస్తాన్ క్రికెటర్ల ప్రదర్శన చూస్తే గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లాల్సిన జట్టు అది. కానీ అదృష్టం కలిసి రావడంతో ఫైనల్ మ్యాచ్ లోకి అడుగుపెట్టింది. గురువారం ఇంగ్లాండ్, భారత్ మధ్య నాకౌట్ పోరు జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్లో తలపడుతుంది.