Lifestyle : ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కానీ ప్రశాంతతను సంపాదించుకోవడం మాత్రం చాలా కష్టంగా మారింది. ధనవంతులైనా, గొప్ప ఉద్యోగాల్లో ఉన్నా, మంచి కుటుంబం ఉన్నా కూడా చాలా మంది “ప్రశాంతత కరువైంది” అంటూ బాధపడుతున్నారు. జీవితంలో సంతోషం అనుభవించాలంటే ప్రశాంతత అవసరం. ఒక వేళ చిన్న చిన్న సంతోషాలు వచ్చినా, అవి స్థిరంగా ఉండటానికి మనసుకు శాంతి ఉండాలి. ప్రశాంతత కోల్పోయిన వ్యక్తి ఎంత సంపాదించినా జీవితాన్ని సంతోషంగా అనుభవించలేడు. అయితే ప్రశాంతత కోసం కొన్ని మార్పులు, కొన్ని నిజాలు, కొంత అవగాహన అవసరం. నేటి బిజీ బిజీ గజిబిజీ జీవితంలో ఈ 10 సూత్రాలను పాటిస్తే ప్రశాంతత మీ సొంతం అవుతుంది.
1. ప్లానింగ్ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది
“నేను ఎలాంటి ప్లానింగ్ చేసుకోను, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుంది” అని చాలా మంది అనుకుంటారు. కానీ ప్లానింగ్ లేకపోవడం వల్లే ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజు ఏం చేయాలి, ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి అనే ప్రణాళిక ఉంటే జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఆఫీసు, ఇంటి పనులు, వ్యక్తిగత సమయం ఇవన్నీ సమతుల్యం చేయాలంటే ముందస్తు ప్రణాళిక చాలా అవసరం.
2. శ్వాస వ్యాయామాలు ఒత్తిడికి మందులా పని చేస్తాయి
ప్రతిరోజూ గట్టిగా శ్వాస తీసుకోవడాన్ని ప్రారంభించాలి. ఇది మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఉదయం 10 నిమిషాలు గట్టిగా శ్వాస తీసుకోవడం, శ్వాసను నియంత్రించడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏ పని చేసినా హడావిడి లేకుండా కూల్‌గా చేయగలుగుతారు.
3. శారీరక వ్యాయామం
శారీరకంగా చురుగ్గా ఉండటానికి వ్యాయామం చేయడం తప్పనిసరి. వ్యాయామం చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి, ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజు కనీసం 30-60 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగవుతుంది, శరీరం బలంగా ఉంటుంది.
4. ధ్యానం
ధ్యానం శరీరం, మనసును పూర్తిగా రీఫ్రెష్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. రోజుకు 10-15 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనస్సు స్థిరంగా ఉంటుంది.
5. నిద్ర
ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర తప్పనిసరి. చక్కటి నిద్ర మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిద్రలేమి ఉన్నవారిలో ఎమోషనల్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.
6. కాఫీ, టీ తక్కువ తాగాలి హెల్తీ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవాలి
చాలామంది ఒత్తిడి ఉన్నప్పుడు కాఫీ, టీ తాగితే తాత్కాలిక ఊరట కలుగుతుందని భావిస్తారు. కానీ వీటిలో కెఫిన్ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. టి బదులు గ్రీన్ టీ, హెర్బల్ టీ, అల్లం టీ లేదా లెమన్ టీ తాగితే శరీరానికి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఇస్తాయి.
7. ఎక్కువగా ఎమోషనల్ అవ్వకండి
మనసులో భావోద్వేగాలను అధికంగా పెంచుకోవడం వల్ల ప్రశాంతత తగ్గిపోతుంది. ఏమైనా నష్టాలు, విఫలతలు ఎదురైతే అవి జీవిత అనుభవంగా తీసుకోవాలి. ఎప్పుడూ బ్యాలెన్స్‌గా ఉండే అలవాటు చేసుకోవాలి.
8. ఈగో, వాదించడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి
“ఆఫీసులో ఎంత కష్టపడినా గుర్తింపు లేదు”, “ఇంట్లో అందరి కోసం తపిస్తున్నా గౌరవం లేదు” అని బాధపడకండి. ఇతరుల నుండి గుర్తింపు, ప్రశంసలు ఆశించేవారు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఇతరుల మాటలకే జీవితాన్ని వదిలేయకండి. అంతే కాకుండా ఈగోకు పోవద్దు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని వాదించడం మానుకోవాలి.
9. పని, విశ్రాంతి సమతుల్యం చేయండి
జీవితంలో పని ఎంత అవసరమో, విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. కుటుంబ సభ్యులతో గడపడం, స్నేహితులతో సరదాగా ఉండటం మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఒకసారి ఒంటరిగా ప్రయాణం చేస్తే చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని కనుగొనగలుగుతారు.
10. కొత్తగా నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి
వంట చేయడం, సంగీతం వినడం, డ్యాన్స్, పుస్తకాలు చదవడం, చిత్రలేఖనం – ఇలా ఏదైనా ప్రత్యేకమైన అభిరుచిని కొనసాగించాలి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
ఈ 10 మార్గాలను జీవితంలో దృష్టిలో ఉంచుకుని పాటిస్తే, ఒత్తిడికి వీడ్కోలు చెప్పి ప్రశాంతమైన జీవితం మీ సొంతమవుతుంది