
Marriage: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. పెళ్లి అనేది ఓ మధురానుభూతి. మరిచిపోలేని రోజు. జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో ప్రతి వారికి ఓ ప్రత్యేకత ఉంటుంది. పూర్వం రోజుల్లో ఇరవై ఏళ్లకే పెళ్లిళ్లు చేసే వారు. వయసొచ్చిందంటే చాలు పెళ్లి చేసుకో నాయనా అని గోల చేసేవారు. దీంతో వారు దానికి సరే అనే వారు. జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం లేకపోవడంతో వ్యవసాయం చేస్తూ తమ జీవితాలను గడిపే సందర్భంలో వయసు తేడా చూసుకునే వారు కాదు. బతిమాలో బామాలో పెళ్లి తంతు ముగించేవారు.
ప్రస్తుతం రోజులు మారిపోయాయి. లోకం గురించి అవగాహన పెరిగిపోతోంది. ఏది మంచి ఏది చెడు అనే విషయాలపై క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మరోపక్క ఉపాధి కూడా ఓ ఆటంకంగా మారుతోంది. దీంతో యువత చిన్న వయసులో పెళ్లికి నిరాకరిస్తున్నారు. జీవితంలో స్థిరపడే వరకు పెళ్లి అనే తంతుకు పూనుకోవడం లేదు. ఫలితంగా అన్ని వివాహాలు ముప్పై ఏళ్లు దాటాకే జరుగుతున్నాయి. ఉద్యోగం సాధించి తరువాత పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నారు.
దీనికి తోడు అమ్మాయిలు కూడా తొందరగా పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. పాతికేళ్లు వస్తే గాని పెళ్లి గురించి పట్టించుకోవడం లేదు. వారు కూడా జీవితంలో స్థిరపడాలనే ఆశ పడుతున్నారు. తమకంటూ ఓ ఉద్యోగం ఉండాలని భావిస్తున్నారు. అందుకే ఆలస్యమైనా ఫరవాలేదని చెబుతున్నారు. అమ్మాయిలు కూడా డిగ్రీలు, పీజీలు సాధించినా ఉద్యోగాలు సాధించేవరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి.
బంధాలు, అనుబంధాల గురించి తెలుసుకోవాలంటే ముప్పై ఏళ్లు దాటితేనే బాగా తెలుస్తుందనే ఆలోచనతో పెళ్లికి తొందరపడటం లేదు. పెళ్లంటే కేవలం కోరికలు తీర్చుకోవడమే కాదు జీవితాన్ని ఆస్వాదించడం అని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. అందుకే ముప్పై ఏళ్లు వచ్చే వరకు ఆగుతున్నట్లు తెలుస్తోంది. భాగస్వామి గురించి బాధ్యతలు తెలుసుకునే క్రమంలో వయసు పెద్దగా పట్టింపులేదని చెబుతున్నారు.
మూడు పదుల వయసు వస్తే కానీ ఏది ఆకర్షణో ఏది జీవితమో తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే జీవితంలో భ్రమలు ఉండొద్దంటే తొందరపాటు వద్దనే విషయం తెలసుకుంటారు. అదే 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంటే బాధ్యతలపై అంత అర్థం అయ్యుండేది కాదని తెలుస్తోంది. ముప్పై ఏళ్లు దాటిన తరువాతే పెళ్లి చేసుకోవాలనే తాపత్రయం యువతలో పెరిగిపోతోంది.