దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొనిరాగా మరికొన్ని కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే కోమాకి సంస్థ తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చింది.

ఎక్స్ జీటీ-ఎక్స్1 ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈ సంస్థ రెండు మోడళ్లలో అందుబాటులోకి తీసుకొనిరాగా జెల్ బ్యాటరీ మోడల్ ధర 45,000 రూపాయల కంటే తక్కువని, లిథియం బ్యాటరీ మోడల్ ధర 60,000 రూపాయల కంటే తక్కువని సమాచారం. ఇప్పటివరకు ఈ సంస్థ 25,000కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్టు తెలుస్తోంది. ఎకో మోడ్ లో ఈ స్కూటర్ ద్వారా 120 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణం చేయవచ్చు.
ఈ స్కూటర్ లో సైజ్ అప్ బిఐఎస్ వీల్స్ తో పాటు సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ లాక్, రిమోట్ సెన్సార్లు, స్మార్ట్ డ్యాష్, భారీ బూట్, యాంటీ థెప్ట్ లాక్ సిస్టమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఫీచర్లు ఉన్నాయి. ఈ సంస్థ లీడ్ యాసిడ్ బ్యాటరీ స్కూటర్లకు సంవత్సరం వారంటీ అందిస్తుండగా లిథియం అయాన్ బ్యాటరీ స్కూటర్లకు 2+1(ఒక సంవత్సరం సర్వీస్ వారంటీ) అందిస్తుండటం గమనార్హం.
పెట్రోల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారే సమయం ఆసన్నమైందని కోమాకి సంస్థ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా చెప్పుకొచ్చారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను చూస్తామని గుంజన్ మల్హోత్రా వెల్లడించారు.