
Mahashivratri 2023: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తుంటాం. ప్రతి ఇంటిలో ఉపవాసం ఉండటం సహజమే. భక్తులు ఉదయం పూట స్నానం చేసి శివాలయానికి వెళ్లి దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మొగ్గు చూపుతారు శివరాత్రి రోజు ఎలాంటి ఆహారం తీసుకోకుండానే రోజంతా ఉపవాసం చేస్తారు. కానీ కొంతమంది మాత్రం కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటారు. శివరాత్రి పర్వదినం రోజు ఆహార నియమాలు కూడా పాటించాలి. లేదంటే మనకు నష్టాలే వస్తాయి. వీటి గురించి తెలుసుకోకపోతే మనకు ఇబ్బందులు ఎదురు కావడం సహజం. అవేంటో తెలుసుకుని వాటిని దూరంగా ఉంచడమే శ్రేయస్కరం.
కఠిన ఉపవాసం అక్కర్లేదు
శివరాత్రి రోజు కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఆహారాలను తీసుకోకుండా ఉండటం మంచిది. అంతేకాని కడుపు మాడ్చుకుని ఉపవాసం చేయమని ఏ దేవుడు కూడా చెప్పడు. మనకు దేవుడిపై ఉన్న అభిమానమే ఉపవాస దీక్ష చేసేలా చేస్తుంది. శివరాత్రి రోజు చేసే ఉపవాస దీక్షకు కూడా మినహాయింపు ఉంటుంది. ఉపవాసం కంటే మనసు శివుడి మీద లగ్నం చేస్తే సరిపోతుంది. కడుపు పూర్తిగా ఎండబెట్టుకుని శివుడిని కొలవాల్సిన అవసరం ఉండదు. కొంతమంది మాత్రం శివరాత్రి రోజు కూడా ఏది పడితే అది తింటారు.
వీటిని తినకూడదు
శివరాత్రి రోజు మద్యం తాగకూడదు. మాంసం ముట్టకూడదు. కాఫీ, టీ కూడా తీసుకోకూడదు. శివుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించకూడదు. బియ్యం, గోధుమ, పప్పులతో చేసిన ఆహారాన్ని కూడా ముట్టుకోకూడదు. వీటిని తింటే మహాపాపంగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా తింటే శివరాత్రి పుణ్యం వారికి వర్తించదట. అందుకే ఈ సీజన్ లో దొరికే పండ్లు తీసుకోవచ్చు. అరటిపండ్లు ఎక్కువగా తినకూడదు. చిలగడ దుంపలు కొద్దిగా తీసుకుంటే మంచిది.
ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా?
శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా? ఉపవాసం వెనుక ఆంతర్యమేమిటి? అందులో దాగి ఉన్న పరమార్థం ఏమిటి అనే దానిపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కడుపు నిండా భోజనం చేస్తే శివుడిపై మనసు నిలవదనే ఉద్దేశంతోనే ఉపవాసం చేయాలనే నిబంధన తీసుకొచ్చారని చెబుతుంటారు. ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్ష కచ్చితంగా ఆచరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు. అనారోగ్యాలను దూరం చేసుకునే వారికి ఉపవాసం ఎంతో సహకరిస్తుందని విశ్వాసం.

ఉపవాసంతో లాభమేనా?
ఉపవాస దీక్షతో కడుపు కూడా పరిశుభ్రంగా అవుతుంది. శరీరంలో ఏవైనా మలినాలు ఉంటే అవి బయటకు వెళ్లిపోతాయి. దీంతో మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకే ఏడాదికి ఒకసారైనా కడుపుకు రెస్ట్ ఇవ్వడం వల్ల మన మెటబాలిజం బలోపేతం అవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉపవాస దీక్షలో ఇన్ని దాగుండటంతో అందరు ఉపవాసం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. శివరాత్రి ఉపవాస దీక్షకు కుటుంబంలో అందరు ఇష్టపడుతుంటారు.