
Post Office Schemes: మనకు ఆపద సమయంలో ఆదుకోవడానికి ఎంతో కొంత డబ్బు మన దగ్గర ఉండాల్సిందే. ఏదైనా అత్యవసరం వస్తే ఇతరుల వద్ద చేతులు చాపినా లాభం ఉండదు. ఇలాంటి సమయంలో మనల్ని ఆదుకునేది పొదుపు పథకాలే. కొంతైనా మొత్తంలో మనం పొదుపు చేస్తే జీవితంలో మనకు మంచి ఆసరాగా ఉంటాయి. దీంతో చాలా మంది పోస్టాఫీసు పథకాల వైపు చూస్తున్నారు. ఇందులో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో వడ్డీ వస్తోంది. కనీసం ఏడు శాతం వడ్డీ ఇస్తుండటంతో మనం పెట్టిన పెట్టుబడి మనకు రెట్టింపు స్థాయిలో వస్తుంది. అందుకే పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు పొదుపు పథకాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
ఏ పథకాలుంటాయి?
పోస్టాఫీసు పొదుపు ఖాతా, రికరింగ్ డిపాజిట్లు, టైం డిపాజిట్లు, నెలవారీ ఆదాయ పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం, సుకన్య సమృద్ధి యోజన ఇలా పలు పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు ఎంతో ఉపయోగకరమైనది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం వృద్ధులకు ప్రయోజనకరం. ఇలా పోస్టాఫీసు ప్రజల సంక్షేమం కోసం పొదుపు పథకాలు అమలులోకి తీసుకొచ్చింది. వీటి సాయంతో చాలా మంది లబ్ధి పొందుతున్నారు.
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లలు ఉన్న వారు వారి భవిష్యత్ పై బెంగ పెట్టుకోకుండా నెలనెల కొంత మొత్తంలో పొదుపు చేసి వారికి లాభం చేకూర్చే విధంగా ఈ పథకం రూపొందించబడింది. ఆడపిల్లకు పదేళ్ల వయసు నుంచి 18 సంవత్సరాలు వచ్చే వరకు తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటుంది. 18 ఏళ్లు దాటాక ఆమెకు అధికారం వస్తుంది. ఖాతా కాల పరిమితి 15 ఏళ్లు. మెచ్యూరిటీ కాల వ్యవధి 21 ఏళ్లు. సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు జమ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనిపై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర
ఈ స్కీంను 1988లో ప్రవేశపెట్టారు. ఇందులో ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టిన అంతే మొత్తంలో రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడిగా పెడితే 10 సంవత్సరాల నాలుగు నెలల తరువాత రెట్టింపు అవుతుంది. అంటే 124 నెలలకు మనం పెట్టిన దానికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాలా మందికి ఇది అనుకూలంగా మారుతోంది. దీనిపై సంవత్సరానికి 7.2 శాతం వడ్డీ వస్తుంది. పొదుపు చేయాలనుకునే వారికి ఇది అత్యంత ప్రయోజనకరమైన పథకంగా చెబుతున్నారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఈ పథకం కాలపరిమితి 15 ఏళ్లు. పదేళ్ల లోపు పిల్లల పేరు మీద ఖాతా ప్రారంభించుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేసుకునే వీలుంటుంది. ఇందులో పెట్టుబడి పెడితే పెట్టిన మొత్తానికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం ఇందులో 7.1 వడ్డీ రేటు లభిస్తోంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం
అరవై ఏళ్లు దాటిన వారి కోసం ఉద్దేశించింది ఈ పథకం. 55 ఏళ్లు పైబడిన 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న రిటైర్డ్ సివిల్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు పొందాలనే ఆలోచనతో తీసుకొచ్చిన పథకం. ఇందులో కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ప్రస్తుతం సీనియర్ సేవింగ్స్ స్కీంపై 8 శాతం వడ్డీ ఇస్తున్నారు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం
ఈ పథకంలో కనిష్టంగా రూ.100 పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఆదాయ పన్ను 80 సీ ప్రకారం ఉద్యోగులు, వ్యాపారులకు ఇది బాగుంటుంది. ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తరువాత కూడా ఈ స్కీం కొనసాగించుకోవచ్చు. ఎన్ఎస్సీ స్కీంల రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తరువాత రూ.21 లక్షలు చేతికొస్తాయి. ఇందులో 6.8 శాతం వడ్డీ రేటు వస్తుంది. ఇలా పోస్టాఫీసు పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిలో పెట్టుబడి పెట్టి లాభాలు సాధించుకోవాలని చెబుతున్నారు.