Talambralu: పెళ్లిలో తలంబ్రాలు.. వీటి వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసా?

వధూవరులు నవ్వుకుంటూ ఆనందంగా ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. మంచి సంతానం, సౌఖ్యం కలగాలని కోరుతూ వధువు శిరస్సుపై మొదటిగా వరుడు తలంబ్రాలు పోస్తాడు. వధువు రాకతో ఇంట్లో ధనధాన్యాలు కలగాలని వరుడు కోరుకుంటాడు.

Written By: Vadde, Updated On : August 15, 2024 10:23 pm

talambralu

Follow us on

Talambralu: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ ప్రధానమైన ఘట్టం. జీవితాంతం గుర్తుండాలని డబ్బు బాగా వెచ్చించి అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తుంటారు. హిందూ సంప్రదాయ పెళ్లిలో అనేక రకాల ఘట్టాలు ఉంటాయి. ఒక్కో ఘట్టానికి ఓక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే వీటిని కేవలం సరదాకి మాత్రమే జరుపుకుంటారని మీరు భావిస్తే పొరబడినట్లే. ఎందుకంటే పెళ్లిలో చేసే ప్రతి ఘట్టం వధూవరులు సంతోషంగా జీవితాంతం కలిసి ఉంటారని నమ్మకంతో చేస్తారు. పెళ్లి జరుగుతున్నప్పుడు నూతన వధూవరులకు అందరూ తలపై పసుపుతో కలిపిన బియ్యం వేస్తారు. వీటిని అక్షితలు అంటారు. ఈ పసుపు బియ్యాన్ని వధూవరులు ఒకరికొకరు తలపై వేసుకుంటే వాటిని తలంబ్రాలు అంటారు. పెళ్లిలో నూతన వధూవరులు ఒకరి తలపై మరొకరు వేసుకోవడం వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకుందాం.

వధూవరులు నవ్వుకుంటూ ఆనందంగా ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. మంచి సంతానం, సౌఖ్యం కలగాలని కోరుతూ వధువు శిరస్సుపై మొదటిగా వరుడు తలంబ్రాలు పోస్తాడు. వధువు రాకతో ఇంట్లో ధనధాన్యాలు కలగాలని వరుడు కోరుకుంటాడు. మెదడు స్థానంలో తగిలేటట్లు శిరస్సుపై తలంబ్రాలను వేయడం ద్వారా ఆశీర్వాదమంత్ర బలం చేరి బుద్ధిని ఇస్తాయని నమ్మకం. అలాగే పసుపు మంగళకరం కాబట్టి బియ్యంలో కలుపుతారు. దీంతో పాటు వరుడు, వధువు బంధువులనైనా సమానంగా చూసుకుంటూ అందరితో కలిసి మెలగాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు. ఇలా మూడుసార్లు ఒకరి తలపై ఒకరు వేసుకున్న తర్వాత వధువరులిద్దరూ పోటీపడి మరి తలంబ్రాలు పోసుకుంటారు.

తలంబ్రాలు మొదటిగా కొబ్బరి కుడకలో బియ్యం వేసి చేతులో పట్టుకుని ఉండగా.. పండితులు మంత్రాలు చదువుతారు. ఆ తర్వాతే బియ్యం పోసుకోవాలి. తలంబ్రాలు పోసుకునేటప్పుడు పండితులు చదివే మంత్రాలు నూతన దంపతులు సౌఖ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయట. అలాగే అన్ని కష్టాలు తొలగి పిల్ల పాపలతో సంతోషంగా నిండు నూరేళ్లు సుఖంగా ఉంటారట. తలపై బియ్యం పోసుకోవడం వల్ల కొత్త జీవితం ఆనందంగా సాగుతుందని మన పెద్దల నమ్మకం.

ఈ రోజుల్లో కొంతమంది దీనిని వేడుకగా భావించి జరుపుకుంటున్నారు. ఈక్రమంలో వాళ్లు బియ్యం వాడకుండా మార్కెట్లో దొరికే థర్మాకోల్ బాల్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే వీటిని వాడకూడదని పెద్దలు చెబుతున్నారు. తలంబ్రాల వేడుకలో సగం విరిగిన బియ్యాన్ని కూడా వాడకూడదు. మన సంప్రదాయాలు ఎలా ఉన్నాయో అలానే పాటిస్తే జీవితాంతం వధూవరులు సంతోషంగా ఉంటారు.