Chinta Chiguru: చింతచిగురు.. చాలా మందికి ఇష్టమైన ఆకు. ఇగురుతో కూర రుచికి రుచే కాకుండా ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అడవులు అంతరించిపోవడం, జనాభా పెరుగుదలతో చింత చెట్లు అంతరించిపోతున్నాయి. దీంతో చింతచిగురు కూడా దొరకని పరిస్థితి నెలకొంటోంది. దొరికిన చింతచిగురు ధర ఆకాశాన్ని తాకుతోంది. ఒకప్పుడు ఉచితంగా చెట్టు ఎక్కి తాజాగా తెంపుకునే చింతచిగురు ఇప్పుడు మార్కెట్లు, షాపింగ్ మాల్స్ చివరకు ఈకామర్స్ సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నారు. ఇక ధర గతంలో రూ.20 నుంచి రూ.50 వరకు ఉండగా, ఈసారి చింతచెట్టు ఎక్కి కూర్చుంది. కిలో రూ.700లకుపైగా పలుకుతోంది. దీంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు.. అందని చింత చిగురు కూడా పుల్లగా మారుతోంది.
హైదరాబాద్‌లో అమ్మకాలు..
చింతచిగురు హైదరాబాద్ మార్కెట్లలో అమ్మకానికి వచ్చింది. గుడిమల్కాపూర్ హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌తోపాటు రైతు బజార్లలో రైతులు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం చింత చెట్ల ఆకులు రాలిపోయి కొత్త చిగురు తొడుగుతున్నాయి. ఈ చిగురును వంటకాల్లో ఉపయోగిస్తారు. పప్పు, మాంసం వంటకాలను భోజన ప్రియులు బాగా ఇష్టపడతారు.
కిలో రూ.600
ఇక ఈ చింతచిగురు ధర కిలో రూ.500 నుంచి రూ.600 వరకు పలుకుతోంది. మొహదీపట్నం రైతుబజార్‌లో శనివారం కిలో చింత చిగురు ధర రూ.700 పలికింది. చెట్టు కొమ్మ చివరకు ఎక్కి ప్రాణాలకు తెగించి సేకరిస్తామని రైతులు చెబుతున్నారు. సెలవు రోజులు, ఆదివారాల్లో చింత చిగురుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక రిటైల్ మార్కెట్‌లో 100 గ్రాముల చింతచిగురు ధర రూ.100 పలుకుతోంది.