New rice production : మన వరి సాగు చేస్తే 130 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. మళ్లీ సాగు చేయాలంటే… నారు పోయాలి.. దుక్కి దున్నాలి.. నాటు వేయాలి.. తర్వాత పంట నూర్పిడి చేయాలి.. కానీ ఒకసారి నాటు వేసి నాలుగేళ్లపాటు అంటే 8 సీజన్లు పంట దిగుబడి చేతికి వస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యం అనిపిస్తున్నది కదూ.. ఇప్పుడు ఇలాంటి ప్రయోగాన్ని చైనా శాస్త్రవేత్తలు చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.. కొత్త వరి వంగడం సాగును సఫలం చేశారు.. దీంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు చైనా వైపు చూస్తోంది.. సాధారణంగా వరి దిగుబడి సరాసరి ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్లకు మించదు. కానీ చైనా తయారు చేసిన వంగడం అంతకుమించి అనేలా దిగుబడి ఇస్తోంది.

ఆహార కొరత తీరుతుంది
ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో ఆహార కొరత ఒకటి. ఆహార కొరత వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది దాకా కన్నుమూస్తున్నారు. హరిత విప్లవం వంటివి ఆహార కొరత తీర్చినా .. ఇప్పటికీ ఆహార కొరత వేధిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అన్నాన్ని ఆహారంగా తీసుకున్న దేశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా మనదేశంలో సరాసరి ధాన్యం దిగుబడి 45 బస్తాలకు మించడం లేదు. ఇప్పటికిప్పుడు దేశంలో ఆహార కొరత లేనప్పటికీ భవిష్యత్తు పరిస్థితుల దృష్ట్యా బఫర్ స్టాకులు ఉండడమే ఉపయుక్తం.. ఎందుకంటే భారత్ లాంటి అతిపెద్ద దేశంలో ఏదైనా జరగరానిది జరిగితే ఆ ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. అయితే చైనా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం వల్ల ఒకేసారి వరి నాటు వేస్తే వరుసగా నాలుగేళ్లపాటు అంటే 8 సీజన్లు దిగుబడి పొందే అవకాశం ఉంది.
ఏమిటి ఈ విధానం
ఒకేసారి వరి నారు పెంచి నాట్లు వేస్తే వరుసగా నాలుగు సంవత్సరాలు అంటే ఎనిమిది సీజన్లు పాటు కోతలు కోయవచ్చు. కోత కోసిన తర్వాత నీరు పెడితే అవే పిలకలపై మరోసారి పైరు పెరుగుతుంది.. దీనివల్ల నాటు ఖర్చు, ప్రయాస తగ్గుతుంది. ఈ కొత్త వంగడాన్ని చైనా శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు.. దీని పేరు “పి ఆర్ 23” గా నామకరణం చేశారు. ఈ కొత్త విత్తనాన్ని దాదాపు 40 వేల ఎకరాల్లో చైనా రైతులు సాగు చేశారు. ఎకరాన సగటున 27 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. పైగా ఈ వంగడాన్ని చీడపీడలు ఆశించలేవు. పేనుబంక, లొట్ట వంటి రోగాలు రావు. నారు పోసిన 25 రోజుల్లో నాటు కోవచ్చు. పెద్దగా క్రిమిసంహారకాలు వాడాల్సిన అవసరం లేదు.
పెట్టుబడి తగ్గుతోంది
సాధారణ పద్దతిలో నాటు వేస్తే ఖర్చు తడిసి మోపెడవుతున్నది. పైగా కూలీల అవసరం నానాటికి పెరుగుతున్నది . పెరిగిన డీజిల్ ధరల వల్ల పొలాన్ని దమ్ము చేయాలంటే వేలకు వేలు వదిలించుకోవాల్సి వస్తున్నది.. ఈ తరుణంలో చైనా శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త వరి వంగడం ప్రపంచ దేశాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.. ఈ వంగడం వల్ల మెరుగైన దిగుబడి రావడంతో పాటు ఖర్చు కూడా లేకపోవడంతో రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. పైగా సరాసరి దిగుబడి కూడా మెరుగ్గా ఉండటంతో ఆహార కొరత సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఈ వంగడం కేవలం మాగాణి భూముల్లో మాత్రమే సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మెట్ట భూముల్లో సైతం వరి సాగవతుంది. మరి అలాంటి భూములకు ఈ వంగడం సరిపోదు.. పైగా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రజలు సన్నాలు మాత్రమే తింటారు. అయితే లావు రకాలు తినేవారికి మాత్రం ఈ వంగడం అంత శ్రేయస్కరం కాదు. మనదేశంలో కూడా ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు మీద కొత్త ఆశలు మోసులెత్తుతున్నాయి.