
బిసిసిఐ చీఫ్ సెక్టర్ కమిటీ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశాడు. నాలుగు రోజుల క్రితం స్టింగ్ ఆపరేషన్ లో భారత జట్టు రహస్యాలను శర్మ బట్ట బయలు చేశాడు. ఫలితంగా బీసీసీఐ పరువు పోయింది. స్టార్ క్రికెటర్లు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బీసిసిఐ పెద్దల సూచన మేరకు తన పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశాడు. తన రాజీనామా పత్రాన్ని బీసిసిఐ సెక్రటరీ జై షా కు పంపించాడు. దీంతో బోర్డు కూడా అతడి రాజీనామాను ఆమోదించింది..
స్టింగ్ ఆపరేషన్ లో బోర్డు పెద్దలు, క్రికెటర్ల గురించి కూడా చాలా విషయాల్ని చేతన్ శర్మ చెప్పేసాడు.. భారత క్రికెటర్లు ఫిట్నెస్ కోసం ఇంజక్షన్ల రూపంలో డ్రగ్స్ తీసుకుంటారని బాంబు పేల్చాడు. అలానే భారత క్రికెటర్ల మధ్య ఈగో ఫైట్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య గొడవ గురించి కూడా ఫాస్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ చెప్పేశాడు. రోహిత్ శర్మ, బుమ్రా లాంటి వారు జట్టులో కొనసాగేందుకు సెలెక్టర్లకు ఎటువంటి ఆఫర్లు ఇస్తారో కూడా కుండబద్దలు కొట్టాడు. దీంతో భారత క్రికెట్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. భారత క్రికెట్లో బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డు కు సంబంధించిన విషయాలు, టీం గురించి రాశారు చెప్పడం రూల్స్ కు విరుద్ధం. ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దల సూచన మేరకు చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశాడు..
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఈగో ఫైట్ నడుస్తోందని, స్టింగ్ ఆపరేషన్ లో చెప్పేసిన చేతన్ శర్మ.. విరాట్ కోహ్లీ అంటే అప్పట్లో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇష్టపడేవాడు కాదని కూడా తేల్చి చెప్పేశాడు. అప్పట్లో విరాట్ కోహ్లీ భారత జట్టు కెప్టెన్సీ తప్పుకోవడానికి గంగూలినే కారణమని జోరుగా ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేస్తూ చేతన్ శర్మ వ్యాఖ్యలు చేశాడు..
చేతన్ పేల్చిన బాంబు వల్ల క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ కాదని, ఒక వర్గం వారు ఆడే ఆట మాత్రమేనని తేలిపోయింది. కొంతమంది వ్యక్తులు తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని ఇండియన్ క్రికెట్ ను శాసిస్తున్నారని తేటతెల్లమైంది. సినిమాల్లో చూపించినట్టు తమకు అనుకూలమైన వారికే అవకాశాలు ఇస్తారని స్పష్టమైంది.. బయట ఎంతో మంది అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే… తమకు నచ్చిన వారికే చోటు ఇవ్వడం పట్ల ఎంతోమంది క్రీడాకారుల జీవితాలు మైదానంలోకి అడుగుపెట్టక ముందే ముగిసిపోతున్నాయి. ఓ అంబటి రాయుడు క్రీడా జీవితమే ఇందుకు ఉదాహరణ. చేతన్ శర్మ పేల్చిన బాంబుతోనైనా బీసీసీఐ గాడిలో పడుతుందా… లేక అలవాటు ప్రకారం తన దారిలో వెళ్తుందా వేచి చూడాల్సి ఉంది. కాగా చేతన్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు నెటిజన్లు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు.. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాల్సిన చోట ఈ పనికిమాలిన పనులు ఏంటని నిలదీస్తున్నారు.. ఆటకు అందలం ఎక్కించాలని… దానిని అర్హత లేని వారికి కట్టబెట్టొద్దని చురకలు అంటిస్తున్నారు.
చేతన్ శర్మ రేపిన దుమారంతో క్రికెటర్స్, బోర్డ్, దేశం పరువు కూడా అంతర్జాతీయంగా పోయింది. బీసీసీఐ చేష్టలపై ఇండియాలోనూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇండియన్ క్రికెట్ లొసుగులన్నీ చేతన్ వ్యాఖ్యలతో బయటపడ్డాయి. దీంతో ఇకనైనా ప్రొఫెషనల్ గా క్రికెట్ ని నడపాలంటే ఏం చేయాలి ? అని బీసీసీఐ, భారత ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది.