
BJP Master Plan: యావత్ భారతావనిని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రలపై పట్టుకు ప్రయత్నిస్తోంది. కీలక రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా దక్షణాది రాష్ట్రాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా వర్కవుట్ కాకపోయేసరికి సీరియస్ గా దృష్టిసారించింది. ఇప్పటికే అధికారంలో ఉన్న కర్ణాటకను పట్టు నిలుపుకోవడంతో పాటు తెలంగాణలో అధికారంలోకి రావాలన్నదే బీజేపీ బలమైన ఆకాంక్ష. ఇందు కోసం ఆ పార్టీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అయితే ఏపీ విషయంలో మాత్రం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. 2024 తరువాత ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని వ్యూహాలు రూపొందిస్తోంది.
మరో ఆరు నెలల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కర్నాటకలో ఆ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అందుకే అక్కడ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. యువనేత రాహుల్ పాదయాత్ర అన్ని రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే సక్సెస్ ఫుల్ గా నడిచింది. అందుకే అక్కడ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ నమ్మకం పెట్టుకుంది. అటు బీజేపీపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని బీజేపీ భావిస్తోంది. అవసరమైతే జేడీఎస్ మద్దతు తీసుకోవడానికి కూడా సై అంటోంది.
తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ను బీజేపీ ఢీకొడుతోంది. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సైతం రేసులో ఉంది. ఇతర పార్టీల నాయకుల చేరికతో బీజేపీ బలం పుంజుకున్నా.. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉంది. అందుకే కేసీఆర్ సైతం కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో బహుముఖ పోరు ఉంది. ప్రధాన రాజకీయపక్షలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఉన్నా తెలంగాణ వైఎస్సార్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు సైతం పోటీకి సిద్ధపడుతున్నాయి. దీంతో ఇక్కడ ఏ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకుంటాయన్న విషయంలో స్పష్టత లేదు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.

కర్ణాటక, తెలంగాణలో గెలుపోటములు ఏపీ పై ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందితే మాత్రం ఏపీలో బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించనుంది. పవన్ కళ్యాణ్ ను ఒప్పించి టీడీపీ వైపు వెళ్లకుండా నిలువరించేందుకు ప్రయత్నించనుంది. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయనుంది. అదే ఓటమి కానీ ఎదురైతే మాత్రం పునరాలోచనలో పడనుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా చంద్రబాబుతో జత కట్టనుంది. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మిత్రులను చేరదీసే భాగంలో చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తానికైతే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి.