Artificial Intelligence: రోడ్డు ప్రమాదం అంటే.. వాహనం రోడ్డు మీద పడటం కాదు.. ఓ కుటుంబం రోడ్డు మీద పడటం. ఇది నిజమే.. మన నిర్లక్ష్యమో, ఎదురుగా వచ్చే వ్యక్తి అతివేగమో మొత్తానికి జరగరానిది జరుగుతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు ప్రాణం పోతుంది. అయిన వాళ్ల రోదనలతో దుఃఖసాగరం అవుతుంది.. ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ… స్పీడ్ గన్ లు అమర్చినప్పటికీ.. విశాలమైన రహదారులు నిర్మించినప్పటికీ… రోడ్డు ప్రమాదాల శాతం తగ్గడం లేదు.. పైగా ప్రతి ఏటా ఇవి పెరుగుతున్నాయి.. దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి.. అందుకే ఈ సమస్యకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పరిష్కారం కనిపిస్తోంది.. ఈ మధ్య దీనికి సంబంధించి భారత దేశంలో అడగులు పడుతున్నాయి.

మానవ తప్పిదాలే కారణం
రోడ్డు ప్రమాదాలు 80 శాతానికి పైగా మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అతివేగం.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ అతివేగం అనే జబ్బును మొత్తం నియంత్రించలేక పోతుంది.. అందుకే డ్రైవర్ వ్యవహార శైలి మెరుగుపరిచేందుకు ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థలో ఆటోమేషన్ ఉండాలి అనేది తాజా ఆలోచన. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ స్పీడ్ కెమెరాలు, ఇన్సిడెంట్ డిటెక్షన్ సాధనాలు, ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు అధునాతన సాఫ్ట్ వేర్ లు, ఆటోమేటెడ్ చలనా జారీ ఉండాలి అనేది నిపుణుల మాట. బాధ్యతా రాహిత్యం గా వ్యవహరించే డ్రైవర్లకు జరిమానాలతో పాటు… మంచిగా వాహనాలు నడిపే డ్రైవర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం మరిన్ని సత్ఫలితాలు ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సూత్రాన్ని పాక్షికంగా అమలు చేస్తున్నారు.. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ఇది బాగా పని చేస్తుందని ఈ అనుభవాలు చెబుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు
ఇందులో డ్రైవర్ వ్యవహార శైలి, డ్రైవింగ్ తీరును పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు.. ఇక మంచి డ్రైవర్లను గుర్తించేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం హమ్ సేఫర్ డ్రైవర్ సేఫ్టీ ఫౌండేషన్, 3 ఎం, కేరళ ప్రభుత్వంతో నీతి అయోగ్ ఏర్పాటుచేసిన కెల్ట్రాన్, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో రోడ్డు సేఫ్టీ 2.0 పేరుతో మన దేశంలో ఒక పైలెట్ ప్రాజెక్టును అమలు చేశారు. రోడ్డు భద్రతకు సంబంధించిన ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్ ఫోర్స్ మెంట్, ఎమర్జెన్సీ కేర్ లోకి సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగరించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.. ఇందుకోసం హంసేవర్ మొబైల్ యాప్ ను రంగంలోకి దించారు. ఈ యాప్ ను డ్రైవర్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాహనం నడిపే వ్యక్తి కంటి ఎత్తులో ఏర్పాటు చేసిన ఒక స్టాండ్ లో దీన్ని ఉంచాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ యాప్ పనిచేస్తుంది. డ్రైవర్ కళ్ళను పర్యవేక్షిస్తుంది. అతడు నిద్రలోకి జారిపోతున్నట్టు గుర్తిస్తే అప్రమత్తం చేస్తుంది. అప్పుడు డ్రైవర్ విషయం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. 7000 మంది డ్రైవర్లపై ప్రయోగాత్మకంగా ఈ సాంకేతికతను పరీక్షించారు. ఒక్క ప్రమాదం కూడా జరగలేదని నిపుణులు చెప్పారు. మొత్తం మీద పదివేల మంది డ్రైవర్లను హం సేఫర్ ఫౌండేషన్ ఇందులో చేర్చుకుంది.. ఏడాది చివరి నాటికి లక్ష మంది డ్రైవర్లను, నాలుగేళ్లలో దేశలోని మొత్తం ట్రక్కు డ్రైవర్లలో 10 శాతం మందికి దీనిని చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.. ప్రస్తుతం దేశంలో 80 లక్షల మంది ట్రక్కు డ్రైవర్లు ఉన్నట్టు అంచనా.

అదనపు ఆదాయం కూడా
హం సేఫ్ ఫర్ డ్రైవింగ్ యాప్ డ్రైవింగ్ అలవాట్లను విశ్లేషించి స్కోర్ కూడా ఇస్తుంది. ఈ పాయింట్ లతో వారికి అదనపు ఆదాయం కూడా లభిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక డ్రైవర్ ప్రతి 10 కిలోమీటర్ల సురక్షిత, మంచి డ్రైవింగ్కు రూపాయి న్నర చొప్పున పాయింట్లు ఇస్తుంది.. దీనిని వారు నగదుగా మార్చుకోవచ్చు. నెలాఖరుకు 1500 వరకు సంపాదించవచ్చు. హం సేఫర్ యాప్ తో బీమా కంపెనీలకు కూడా లాభం ఉంటుంది.. డ్రైవింగ్ చేసే వ్యక్తి అలవాట్లను గమనించి అందుకు అనుగుణంగా బీమా ప్రీమియాన్ని నిర్ధారించొచ్చు. మంచి డ్రైవింగ్ స్కోర్ ఉంటే మెరుగైన డ్రైవర్ అనే బిరుదు కూడా ఇవ్వచ్చు. దీనివల్ల వారికి సాధ్యమైనంత మేర తమ బీమా ధరలను తగ్గించుకోగలుగుతారు. బీమా క్లెయిమ్ ల సెటిల్ మెంట్లకు ఈ యాప్ విశేషంగా పనికొస్తుంది. ప్రస్తుతం వాహనంలో సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే పదేపదే అలారం మోగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడానికి వాహనంలోని కెమెరా గుర్తించిన మరుక్షణం ఈ చలానా జారీ అయ్యే అవకాశం ఉంది.