Diabetes: నచ్చిన తీపి తినలేం. భుక్త ఆయాసం వచ్చేలా భుజించలేం. నోటికి తాళం వేయాలి. కొంచమైనా విడతలుగా తినాలి.. చేదు మాత్రలు మింగాలి.. ఇక పాస్ట్, పోస్ట్ పనిష్మెంట్ సరే సరి. షుగర్ వస్తే చాలామంది ఎదుర్కొనే సమస్యలు ఇవి.. కానీ షుగర్ కంట్రోల్ లేకపోతే వచ్చే సమస్యలు మామూలుగా ఉండవు. గుండె జబ్బులు, నాడులు దెబ్బతినడం వంటి వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవే కాకుండా మగవారిలో, ఆడవారిలో శృంగార సమస్యలు తెచ్చి పెడుతూ ఉంటాయి.

టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గుతుంది
షుగర్ మూలంగా మగవారిలో టెస్టో స్టీరాన్ మోతాదులు తగ్గుతాయి. శృంగారం మీద ఆసక్తి, ఉత్సాహం సన్నగిల్లుతుంది. కుంగుబాటు, ఆందోళన, నిస్సత్తువ, బరువు పెరగడం, తరచూ మూత్ర ఇన్ఫెక్షన్లు, స్తంభన లోపం, సంతాన సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు చుట్టుముట్టుతాయి. ఇక ఆడవారిలో శారీరకంగా, మానసికంగా సమస్యలు మొదలవుతాయి. శృంగార వాంఛ లోపించడం, యోని పొడిబారటం, సంభోగ సమయంలో నొప్పి, మూత్రకోశ ఇన్ఫెక్షన్ల వంటివి వేధిస్తుంటాయి. ఇక అండాశయాల్లో నీటి తిత్తులు గల యువతుల్లో మధుమేహం 10 శాతం ఎక్కువ ఉంటుంది. వీటి బారిన పడ్డ వారిలో కణాలు ఇన్సులిన్ గ్రహించలేవు. దీంతో రక్తంలో ఇన్సులిన్ మోతాదు పెరుగుతుంది. గర్భధారణకు విఘాతం కలుగుతుంది. నెలసరి సమయంలో అండం విడుదల కాదు..
ఇవి చేయండి
షుగర్ అనేది ఇప్పుడు సాధారణ రోగం అయిపోయింది.. దీనిని నియంత్రణలో ఉంచుకున్నంత వరకు మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ ఒక్కసారి కట్టు తప్పిందా… నరకం చూపిస్తుంది. అయితే ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. క్రమం తప్పకుండా మందులు వాడాలి. గ్లూకోజ్ మోతాదు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి.. అవసరం అయితే ఇన్సులిన్ ఇంజక్షన్లు వేసుకునేందుకు వెనకాడొద్దు. ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్, చిక్కుళ్ళు, బఠాణి, బ్రకోలి, తాజా పండ్లు, పప్పు గింజలు వంటివి తీసుకోవాలి. వీటిలో పీచుపదార్థం ఎక్కువ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ ను త్వరగా కలవకుండా చూస్తుంది. రోజు వ్యాయామం చేయడం తప్పనిసరి. ధ్యానం, యోగాను ఇందుకు జత చేయాలి. కంప్యూటర్లు, టీవీల ముందు కూర్చోవడం తగ్గించుకోవాలి.. తగినంతసేపు కంటి నిండా నిద్ర పోవాలి. పొగ, మద్యం, అతిగా కెఫిన్ తీసుకునే అలవాటు ఉంటే మానుకోవాలి. పుస్తకాలు చదవడం, శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా ఒత్తిడిని తగ్గించే పనులు చేయాలి. మగవారిలో స్తంభన లోపం, ఆడవారిలో అసంకల్పితంగా యోని కండరాలు సంకోచించడం వంటి సమస్యలు ఉంటే చికిత్స తీసుకోవాలి. శృంగార సమస్యల గురించి ఏమైనా ఆందోళనలకు గురవుతుంటే మానసిక నిపుణుల సలహా తీసుకోవాలి.. సురక్షితమైన శృంగారానికి కండోమ్ ల వంటి వాడుకోవాలి. భాగస్వామితో శృంగార జీవితానికి కట్టుబడి ఉండాలి.

ఆహారాన్ని మార్చుకోవాలి
షుగర్ వచ్చిన వాళ్ళల్లో చాలామంది నోటికి తాళం వేయలేరు. దీనివల్ల షుగర్ స్థాయి పెరిగి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివారు తక్కువ మొత్తాన్ని ఎక్కువసార్లు తినాలి. తీపి వస్తువుల జోలికి అసలు పోకూడదు. ముఖ్యంగా అన్నాన్ని తగ్గించాలి. వాటి స్థానంలో తృణధాన్యాలను చేర్చుకోవాలి. అయినప్పటికీ అన్నం మీద మోజు తగ్గకపోతే మార్కెట్లో షుగర్ ఫ్రీ బియ్యం లభ్యమవుతున్నాయి. వాటిని ఆహారంగా తీసుకోవచ్చు. సేంద్రియ విధానంలో పండిన బియ్యం కూడా లభిస్తున్నాయి. అవి కూడా షుగర్ స్థాయిని తగ్గిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.. మధుమేహం నియంత్రణలో ఉంటే మరే ఇతర వ్యాధులు దరి చేరవు.