Srikalahasti Temple: తిరుమల తిరుపతి దేవస్థానంను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అంటుంటారు. కొందరు ప్రతీ సంవత్సరం కచ్చితంగా వెళ్తుంటారు. తిరుపతికి వెళ్లినప్పుడు శ్రీవారి దర్శనం మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. వీటిలో కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళ హస్తి లాంటివి ఉన్నాయి. వీటిలో శ్రీకాళ హస్తి గుడిలోకి వెళ్లిన తరువాత నేరుగా ఇంటికే రావాలని, మరో ఆలయానికి వెళ్లకూడదని కొందరు అంటుంటారు. అసలు ఈ ఆలయంలోకి వెళ్లిన తరువాత మరో ఆలయానికి ఎందుకు వెళ్లకూడదు? అసలేంటి సంగతి?
ఉద్యోగం, వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా ఏడాదిలో కొన్ని రోజులు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఇంటి దగ్గరలో ఉండే గుడికి మాత్రమే కాకుండా తీర్థయాత్రలకు వెళ్లడం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుందని చాలా మంది మానసిక నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలామంది తిరుమలకు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే తిరుమల దర్శనం మాములుగా కాదు. ఎంతో ప్రయాస పడాలి. శ్రీవారి దర్శనం పూర్తయిన తరువాత శ్రీకాళ హస్తి కూడా వెళ్లాలని చాలా మంది అనుకుంటారు.
తిరుపతికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం నిర్మాణం ఎంతో వైభంగా ఉంటుంది. ఈ ఆలయంలో పంచభూతాల్లో ఒకటైన వాయులింగం ప్రతిష్టించబడింది. దీనిని 5వ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళ హస్తీశ్వరుడు, ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణమూర్తి ఇలా ఒక్కొక్కరు ఒక్కో దిక్కున ఉంటారు. ఆలయానికి నాలుగు దిక్కుల గోపురాలు ఉంటాయి. 120 అడుగుల ఎత్తులో ఉన్న రాజగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు. స్వామి గ్రామోత్సవం ఈ గోపురం నుంచే మొదలవుతుంది.
శ్రీకాళహస్తిస్వర ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుంటే రాహు-కేతువుల దోషం ఉంటే పోతుంది. దోష నివారణకు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాపాలను వదిలేసిన తరువాత నేరుగా ఇంటికి వెళ్లాలి. లేదా మరో ఆలయానికి వెళితే దోష నివారణ జరగదు అని పండితులు చెబుతున్నారు. అందువల్ల ఈ ఆలయం దర్శించుకున్న తరువాత నేరుగా ఇంటికే వెళ్లాలి అని అంటారు. గ్రహణ సమయంలోనూ ఈ ఆలయం తెరిచే ఉంటుంది. మిగతా ఆలయాలు మూసివేస్తే ఈ ఆలయంలో మాత్రం రోజంతా పూజలు చేస్తుంటారు.