Jagan Vs KCR
Jagan Vs KCR: దేశవ్యాప్తంగా ఎన్నికల మూడ్ వస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో జగన్ లు తమ పట్టు నిలుపుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలను దూకుడుగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ గత నాలుగేళ్లుగా సంక్షేమ పథకాల బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా కెసిఆర్ సైతం పథకాలను ప్రారంభించి లబ్ధిదారుల అకౌంట్ లలో నగదు జమ చేస్తున్నారు.
ఈ డిసెంబర్లో తెలంగాణకు ఎన్నికలు జరగనున్నాయి. మరో మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో ఎన్నికలకు కెసిఆర్ అండ్ కో సిద్ధమైపోయింది. అందుకు సంబంధించి సరంజామా మొత్తం సిద్ధం చేసుకుంది. విపక్షాల ఊహకు అందని స్థితిలో కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తన పథకాలతో బెంబేలెత్తిస్తున్నారు. వందల్లో కాదు..వేలల్లో కాదు.. ఒక్కో పథకానికి సంబంధించి లబ్ధిదారుడికి లక్షల్లో ముట్టచెబుతున్నారు. దళిత బంధు కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నారు. బీసీ బంధు, మైనార్టీ బంధు కింద లక్ష రూపాయల వంతున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇక గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ పూర్తి చేశారు. ఇలా ప్రతిరోజు వేల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేస్తున్నారు. వారిని ఓటర్లుగా మార్చుకుంటున్నారు. తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుంటున్నారు.
ఏపీలో జగన్ మాత్రం గత నాలుగేళ్లుగా బటన్లు నొక్కుతూనే ఉన్నారు. ప్రారంభంలో ఈ పథకాలు మంచి దూకుడుగా ఉన్నా.. తరువాత కొర్రీలు ప్రారంభమయ్యాయి. అనుకున్న సమయానికి బటన్లు నొక్కలేకపోతున్నారు. ఇలా నొక్కిన వాటికి సైతం లబ్ధిదారులకు సకాలంలో నగదును జమ చేయలేకపోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో విద్యార్థులకు నరకం చూపించారు. ఇటీవల సున్నా వడ్డీ పేరుతో కోటి మంది డ్వాక్రా మహిళలకు 1200 కోట్లకు సంబంధించి బటన్ నొక్కారు. ఒక్కో డ్వాక్రా మహిళకు కేవలం 1200 రూపాయలు చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటికీ చాలామందికి నగదు జమ కాలేదు. దీంతో ఎన్నికలకు సమీపించేసరికి ఏమిటి పరిస్థితి అని అధికార పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే సంక్షేమ పథకాల అమలు విషయంలో కెసిఆర్ ఒకలా.. జగన్ మరోలా వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ గత నాలుగున్నర ఏళ్లుగా అభివృద్ధిపై దృష్టి పెట్టారు. మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులు చేపట్టారు. ప్రజలకు మౌలిక వసతులు అందించగలిగారు. గ్రామీణాభివృద్ధితోపాటు పట్టణీకరణ పై ఫోకస్ పెట్టారు. అదే జగన్ విషయంలో అసలు సిసలు వైఫల్యం. గత నాలుగేళ్లుగా శాశ్వత అభివృద్ధి ప్రాజెక్ట్ పనులేవి చేపట్టలేదు. ప్రజలకు మౌలిక వసతులు అందించిన దాఖలాలు లేవు. కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. అవి కూడా స్వల్ప ప్రయోజనాలకు చెందినవే. కానీ కెసిఆర్ విషయంలో అలా కాదు. ప్రజల జీవనస్థితిగతులు మార్చేలా ఆయన పథకాలు ఉన్నాయి. సో తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో పాలనా విధానం రివర్స్ లో ఉందన్నమాట.