2025 Software Jobs: మైక్రోసాఫ్ట్ నుంచి మొదలు పెడితే గూగుల్ వరకు.. ఆపిల్ నుంచి మొదలు పెడితే అమెజాన్ వరకు.. ప్రతి కంపెనీ ఉద్యోగులను వదిలించుకుంటున్నది. బలవంతంగా మెడలు పట్టి బయటకి గెంటి వేస్తున్నది. కారణంతో సంబంధం లేకుండా.. పింకు స్లిప్పు లు ఇచ్చేస్తున్నది. దీంతో వేలాది మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయి రోడ్డు మీద పడుతున్నారు. వేరే ఉద్యోగం దొరకక.. ఉన్న ఉద్యోగం పోయి నరకం చూస్తున్నారు. కొత్త ఉద్యోగాల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. కుటుంబాన్ని సాకలేక.. ఏం చేయాలో తెలియక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలో కొంతమంది మాత్రం కోట్లలో ప్యాకేజీలు సంపాదిస్తున్నారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో సంపాదన సంపాదిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ చుట్టూ తిరుగుతోంది. కృత్రిమ మేధ లో నిష్ణాతులైన వారు వందల కోట్లల్లో ప్యాకేజీలు తీసుకుంటున్నారు. 30 సంవత్సరాలు లేకుండానే మిలియనీర్లుగా అవతరిస్తున్నారు. అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామానికి ప్రధాన కారణం మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్. ఎందుకంటే కృత్రిమ మేధ లో మెటా సంస్థ ఇంతవరకు తనదైన మార్పును చూపించలేకపోయింది. పోటీ సంస్థలైన గూగుల్, ఓపెన్ ఏఐ, అమెజాన్ , ఎక్స్ వంటి కంపెనీలు అదరగొడుతున్నాయి. కృత్రిమ మేధ లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాయి. అంతేకాదు మార్కెట్ మొత్తాన్ని ఇవి శాసిస్తున్నాయి. ఈ క్రమంలో మెటా సంస్థ అధినేత బర్గ్ సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టాడు.. ఇతర సంస్థల్లో పేరుపొందిన ఇంజనీర్లను తీసుకొని కృత్రిమ మేధ లో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడానికి అడుగులు వేస్తున్నాడు. అయితే ఇతర సంస్థలోని ఇంజనీర్లకు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేసి హైయర్ చేసుకుంటున్నాడు. సాధారణ వేతనానికి అదనంగా స్టాక్ ఆప్షన్స్, సైన్ ఆన్ బోనస్.. ఇతర ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాడు. తద్వారా కృత్రిమ మేధలో పనిచేసే ఇంజనీర్లకు మెటా కంపెనీ అవకాశాల స్వర్గంలాగా కనిపిస్తోంది.. ఇటీవల భారతీయ మూలాలు ఉన్న బన్సల్ అనే కృత్రిమ మేధ ఇంజనీర్ కు బర్గ్ ఏకంగా 800 కోట్లు ఆఫర్ చేశాడు. బన్సల్ గతంలో ఓపెన్ ఏఐ సంస్థలో పనిచేశాడు. అతడు అందులో కీలకంగా ఉన్నాడు. అతని ప్రతిభను గుర్తించిన బర్గ్ ఒక్కసారిగా తన కంపెనీలోకి హైర్ చేసుకున్నాడు. బన్సల్ మాత్రమే కాకుండా ఇప్పుడు చైనా దేశానికి చెందిన మరో ఇంజనీర్ ను 1600 కోట్లు ఆఫర్ చేసి తీసుకున్నాడు. ఒకరకంగా కృత్రిమ మేధ లో అత్యుత్తమ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను బర్గ్ తన సంస్థలోకి తీసుకుంటున్నాడు.. డీప్ మైండ్, గూగుల్, ఓపెన్ ఏఐ సంస్థలకు మించి తన కంపెనీని అభివృద్ధి చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సంస్థల నుంచి ఏడుగురు పరిశోధకులను తన కంపెనీలకు తీసుకున్నాడు. అంతేకాదు స్కేల్ ఏఐ అనే సంస్థ సీఈవో వాంగ్ ను తన కంపెనీలోకి తీసుకున్నాడు బర్గ్. అంతేకాదు ఆ సంస్థలో సగం కంటే తక్కువ వాటాను బర్గ్ లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టి సొంతం చేసుకున్నాడు.
టాప్ టాలెంట్ గుర్తించడంలో బర్గ్ రిక్రూటింగ్ పార్టీ అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఆ గ్రూపులో చర్చలు జరుపుతూ.. ఉద్యోగులను తీసుకుంటున్నాడు. ఏఐలో సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించడానికి ఏకంగా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశాడు.. దీంతో సిలికాన్ వ్యాలీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.. బర్గ్ చేస్తున్న ప్రయత్నంతో మైక్రోసాఫ్ట్, ఆంత్రో పిక్, ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి కంపెనీలు తమ సంస్థలో ఇంజనీర్లను జారిపోకుండా జాగ్రత్త పడుతున్నాయి. వారికి భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి. మరోవైపు బర్గ్ చేస్తున్న ప్రయత్నాన్ని ఓపెన్ సీఈవో శామ్ ఆల్ట్ తప్ప పడుతున్నాడు.. ఇప్పటికే కోడింగ్ విభాగంలో పనిచేస్తున్న వారిని అడ్డగోలుగా తొలగిస్తున్న గూగుల్, మెటా.. కృత్రిమ మేధ లో పరిశోధకులకు మాత్రం కనివిని ఎరుగని స్థాయిలో ఆఫర్లు ప్రకటిస్తుండడం గమనార్హం.