Risky stunt death:తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం నిన్న లెజెండరీ నటుడు కోట శ్రీనివాస రావు(Kota Srinivasarao) మృతి పట్ల తీవ్రమైన దిగ్బ్రాంతి వాతావరణం లో ఉంటే, తమిళ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు స్టంట్ మాస్టర్ గా వ్యవహరించిన రాజు(Stunt Master Raju) ప్రస్తుతం తమిళ హీరో ఆర్య(Arya), పీఏ రంజిత్(PA Ranjith) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు స్టంట్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక రిస్కీ ఫైట్ సన్నివేశం చేస్తున్నప్పుడు కారు ప్రమాదం జరిగింది. దీంతో స్టంట్ మాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని తమిళ హీరో విశాల్ అధికారికంగా మీడియా కి తెలియజేశాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కారు ఒక స్లోప్ మీద నుండి వేగంగా పైకి ఎగిరి రెండు మూడు పల్టీలు కొట్టి క్రింద పడింది.
క్రింద పడిన వెంటనే డైరెక్టర్ కట్ చెప్పాడు. కానీ కార్ లో రాజు మాస్టర్ నుండి ఉలుకు పలుకు లేదు. దీంతో డైరెక్టర్ తో సహా మూవీ స్టాఫ్ మొత్తం కారు వద్దకు వెళ్లి చూడగా రాజు మాస్టర్ చనిపోయి ఉన్నాడు. ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. షూటింగ్ స్పాట్ లో ఒక రిస్కీ షాట్ చేస్తూ ఇలా ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు చాలా తక్కువగా జరిగాయి. అందులో ఈ ఘటన కూడా ఒకటి కావడం శోచనీయం. ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ ‘రాజు మాస్టర్ ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. ఆర్య, రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక ఫైట్ సన్నివేశం లో జరిగిన ప్రమాదం కారణంగా ఆయన చనిపోయాడు. గతం లో రాజు మాస్టర్ నా సినిమాలకు ఎన్నో రిస్కీ స్టంట్స్ చేశాడు. చాలా సాహసవంతుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం తమిళ సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం. ఈ సందర్భంగా రాజు మాస్టర్ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా రాజు స్థానం లో ఉండి నేను సహాయ సహకారాలు అందిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు విశాల్.