T20 World Cup 2022: ప్రపంచ కప్ ప్రతి క్రికెట్ క్రీడాకారుడి కల. జీవితాశయం కూడా. మేటి బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ కూడా తన జీవిత ఆశయం ఇండియాకు వరల్డ్ కప్ సాధించి పెట్టడమే అని అన్నాడంటే ఆ మెగా టోర్నీకి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. తమ జట్టును విశ్వవిజేతగా నిలిపేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా క్రీడాకారులు వదులుకోరు. నూరు శాతం శ్రమిస్తారు. అందులోనూ ధనాధన్ షాట్లు, టపా టపా నేలకూలే వికెట్లు, భారీ స్కోరులు, మెరుపు ఇన్నింగ్స్ లు, బౌలర్ ఎవరైనా సరే బాదడమే. పరుగుల వరద పారించడమే. అదే టీ 20 క్రికెట్ మంత్రం. ఆటకు వేగాన్ని ఆపాదించి ప్రపంచ క్రికెట్ గతినే మార్చిన ఈ పొట్టి ఫార్మాట్ ఆట ఆదివారం నుంచి మరో విశ్వ సమరానికి సిద్ధమైంది. కంగారుల గడ్డ పై 16 నుంచి మొదలయ్యే ఈ టోర్నీ నెలరోజుల పాటు క్రీడాభిమానులకు అసలు సిసలైన ఆట మజాను అందిస్తుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఈ టోర్నీలో అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, హోబర్ట్, మెల్బోర్న్, సిడ్నీ, పెర్త్ ఇలా మొత్తం ఏడు మైదానాల్లో పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 45 మ్యాచ్ లు నిర్వహించేలా రూపొందించిన షెడ్యూల్లో 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.

బ్యాట్స్మెన్ దే హవా
బాదుడే టి20 తారక మంత్రం కాబట్టి బ్యాట్స్ మెన్ ల హ వా సాగుతుంది. అభిమానులకు మరింత వీనుల విందైన క్రికెట్ ఆటను అందించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టి_20 మ్యాచ్ ల్లో బౌండరీ లైన్ ను కుదించింది. 20 ఓవర్ల ఇన్నింగ్సే కావడంతో తొలి బంతి నుంచే బ్యాట్స్మెన్ ఎదురుదాడికి దిగుతాడు. క్రీజులో కుదురుకోవడం, చూసి ఆడటం అనే సంప్రదాయమే ఉండదు. ప్రతి బంతిని బౌండరీ దాటించాలనే కసితో కొడతారు.. అలా కొడితేనే మనుగడ. అందుకే బౌలర్లకు ఈ ఫార్మాట్ కత్తి మీద సాము. రివర్స్ స్వీప్ లు, కీపర్ తల మీదుగా సిక్సర్లు.. ఒక్కటేమిటి వినూత్న షాట్లకు టి20 లు పెట్టింది పేరు.
భారత్ ఫేవరెట్ కానీ
బ్యాటింగ్ బలం, ఆటగాళ్లు అనుభవం, ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పై t20 సిరీస్ నెగ్గిన ఉత్సాహం.. పైగా ఐసీసీ టి20 జట్లలో అగ్రస్థానం.. ఇవన్నీ భారత జట్టుకు అనుకూలతలే. కీలక సమయంలో భారత బ్యాటింగ్ బాద్ షా విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం, సూర్య కుమార్ యాదవ్ భయంకర బ్యాటింగ్, దినేష్ కార్తీక్ సూపర్ ఫినిష్, తొలి టి20 వరల్డ్ కప్ నుంచి ఆడుతున్న రోహిత్ శర్మ అనుభవం టీమిండియా ప్రధాన బలాలు. కానీ ఎటొచ్చీ భారత జట్టు ఆందోళన మొత్తం బౌలింగ్ ఇదే. భారత్ అమ్ములపొదిలో కీలక అస్త్రం ఫేసర్ బమ్రా. గాయం కారణంగా అతడు ఈ మెగా టోర్నీకి దూరమవడం భారత జట్టుకు పెద్ద దెబ్బ. చివరి ఓవర్లలో భారత బౌలర్లు భారీ పరుగులు సమర్పిస్తుండటం ఇబ్బంది కరం. ఫీల్డింగ్ లోను లోపాలు ఉన్నాయి. ఈ తప్పులు సరి చేసుకుంటే భారత జట్టుకు కప్ గెలుచుకునేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి.
జట్ల అంచనా ఇది
గ్రూప్ ఎ లో నమీబియా, నెదర్లాండ్, శ్రీలంక, యూఏ ఈ ఉన్నాయి.
గ్రూప్ బి లో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.
ఇక సూపర్ 12 గ్రూపులో..
గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ ఏ విన్నర్, గ్రూప్ బి విన్నర్ జట్లు ఉంటాయి.
ఇక గ్రూప్ 2 లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, గ్రూప్ బి విన్నర్, గ్రూప్ ఏ రన్నర్ జట్లు ఉన్నాయి.

ఛాంపియన్లుగా నిలిచింది వీరే
2007లో ప్రారంభమైన టి20 టోర్నీ విజయవంతం అవుతుందో కాదో అని ఐసీసీలో కొంత ఆందోళన ఉండేదట. కానీ ఆరంభం నుంచే ఈ టోర్నీ అభిమానులకు అసలైన ఆట మజాను అందించింది. 2007లో తొలి టీ 20 వరల్డ్ కప్ ను ధోని సారధ్యంలోని భారత జట్టు కైవసం చేసుకుంది. 2009లో పాకిస్తాన్ జట్టు కప్ ను ముద్దాడింది. 2010లో ఇంగ్లాండ్ జట్టు టి20 వరల్డ్ కప్ ను ఒడిసి పట్టింది. 2012లో వెస్టిండీస్ కప్ ను గెలుచుకుంది. 2014లో శ్రీలంక తొలిసారి టీ20 వరల్డ్ కప్ ను స్వదేశానికి సగర్వంగా తీసుకెళ్లింది. 2016లో వెస్టిండీస్ మరోసారి విజేతగా నిలిచింది. 2021లో ఆస్ట్రేలియా టి20 వరల్డ్ కప్ ను సాధించింది.