TANA tarpaulin distribution : గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మరో అభినందనీయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాలల్లో బహిరంగ తరగతులు, సమావేశాల సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, 16 పాఠశాలలకు టార్పాలిన్లను అందజేసింది.

ఈ కార్యక్రమం కొప్పాకలోని పీఎం శ్రీ జడ్పీ హై స్కూల్ ప్లస్ వేదికగా ఘనంగా జరిగింది. తానా న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ సుధీర్ నరేపలుపు ఆర్థిక సహకారంతో తానా కోశాధికారి శ్రీ రాజా కసుకుర్తి పర్యవేక్షణలో ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగింది.

ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు డా. నరెన్ కోడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ లావు మాట్లాడుతూ, గ్రామీణ విద్యాభివృద్ధికి తానా కట్టుబడి ఉందని.. విద్యార్థుల సౌకర్యార్థం చేపట్టిన ఈ చిన్న సాయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఎవరెవరికి లబ్ధి?
కొప్పాక పరిసరాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 16 ప్రభుత్వ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలకు ఈ టార్పాలిన్లను పంపిణీ చేశారు. ఇందులో ముఖ్యంగా కొప్పాక, అంకన్నగూడెం, సింగవరం, పెదకడిమి, అమ్మపాలెం, భోగాపురం, దుగ్గిరాల, పినకడిమి, వంగూరు, లక్ష్మీపురం, రామచంద్రపురం వంటి గ్రామాల్లోని విద్యార్థులు ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కూర్చునే సమయంలో విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

విద్యార్థుల సౌకర్యమే ధ్యేయం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా కోశాధికారి రాజా కసుకుర్తి మాట్లాడుతూ “గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల కార్యకలాపాల సమయంలో విద్యార్థులు నేలపై కూర్చోవడం మేము గమనించాం. ఆ ఇబ్బందిని తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ టార్పాలిన్లను అందించాం” అని వివరించారు.
కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కర్రి శ్రీరామ్, ప్రధానోపాధ్యాయులు శ్రీ మట్టా రామకృష్ణ, సమన్వయకర్త శ్రీమతి సునీత, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తమ పాఠశాలలకు అందిన ఈ సాయం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ, తానా సంస్థకు, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నిరంతరం సాగుతున్న తానా సేవా ప్రస్థానం
అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేయడమే కాకుండా, మాతృభూమిలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వ్యవసాయం, వైద్యం వంటి రంగాల్లో తానా చేస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి. సుదూర దేశంలో ఉన్నా.. మన ఊరి బడిని గుర్తుంచుకుని, విద్యార్థుల అవసరాలను తీరుస్తున్న తానా కృషిని స్థానికులు కొనియాడుతున్నారు.

