Revanth Reddy Governance Positive Image : “ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదు. పరిపాలన కూడా సరిగ్గా లేదు. అధిష్టానం ఏమాత్రం స్వేచ్ఛ ఇవ్వడం లేదు. అభివృద్ధి ఆగిపోయింది. అప్పులు తేవడం పెరిగిపోయింది. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విపరీతంగా అభివృద్ధి చెందితే.. ఇప్పుడు మాత్రం నేల చూపులు చూస్తోంది” ఇదిగో ఇలా సాగిపోతోంది గులాబీ పార్టీ విమర్శల వ్యవహారం. సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. రేవంత్ వేసే ప్రతి అడుగును భూతద్దంలో పెట్టి చూస్తోంది గులాబీ సోషల్ మీడియా.
ఈ స్థాయిలో విమర్శలు.. స్వపక్షం నుంచి ఒత్తిడి.. అధిష్టానం నుంచి అంతగా లభించని సపోర్టు.. ఇన్ని ప్రతికూలతల మధ్య రేవంత్ రెడ్డి పడుతున్న ఇబ్బందులు మామూలువి కాదు. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూనే పరిపాలన సాగిస్తున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి అతని స్థానంలో మరొక నాయకుడు ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.. కాంగ్రెస్ పార్టీ నాలుగు ముక్కలయ్యేది. తనకున్న చాకచక్యంతో.. పరిజ్ఞానంతో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి.. ఆయన పరిపాలనలో లోపాలు లేవా? ప్రజలకు అంతా మంచే జరుగుతోందా? ప్రభుత్వం నుంచి ప్రజలకు బ్రహ్మాండమైన సహకారం లభిస్తోందా? ఈ ప్రశ్నలకు లేదు అని, కాదు అని సమాధానం రావచ్చు. అందులో అనుమానం కూడా లేదు. కాకపోతే ఇన్ని ప్రతికూలతల మధ్య.. రేవంత్ రెడ్డి పరిపాలన సాగించడమే అసలైన ఆశ్చర్యకరమైన విషయం.
రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదంగా మారాయి. మంత్రుల వ్యవహార శైలి కూడా ఇబ్బందికరంగా మారింది.. ఇవన్నీ ప్రతిపక్ష గులాబీ పార్టీకి అనుకూలంగా మారాయి. అయితే ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి పరిపాలన రధాన్ని సవ్యంగా ముందుకు సాగించడమే ఇక్కడ అసలైన గొప్ప విషయం. ఎందుకంటే గులాబీ పార్టీ సోషల్ మీడియా బలంగా ఉంది. ఆ పార్టీ మొత్తాన్ని కేటీఆర్ నడిపిస్తున్నారు. ఆర్థికంగా గులాబీ పార్టీకి బలం విపరీతంగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే నాయకుల వరకు అన్ని లోపాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి వీటన్నింటిని దాటుకొని అటు పార్టీని.. ఇటు ప్రభుత్వాన్ని ముందు వరుసలో నిలపడమంటే మామూలు విషయం కాదు.
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వరస విజయాలను సాధిస్తుంది.. తెలంగాణలో చెప్పుకునే స్థాయిలోనే మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ముందుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది.. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉపయోగ ఎన్నికల్లో గెలుపును అందుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదని.. ఈ ఉప ఎన్నికలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండం అని కేటీఆర్ పదేపదే వ్యాఖ్యానించారు. కానీ వాస్తవ ఫలితం మాత్రం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వచ్చింది. ఒకరకంగా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా అటు కేటీఆర్ కు, ఇటు గులాబీ పార్టీకి ఏకకాలంలో చెక్ పెట్టారు. దానిని మర్చిపోకముందే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష గులాబీ పార్టీకి దిమ్మతిరిగే విధంగా సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో స్థానిక సంస్థలలో సీట్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. తద్వారా గులాబీ పార్టీ తనపై పదే పదే చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు రేవంత్ రెడ్డి. ప్రజల ముందు సానుభూతి మంత్రాన్ని పఠిస్తూ సరికొత్త రాజకీయ నాయకుడిగా అవతరిస్తున్నారు.. తెలంగాణ ప్రజల్లో పాజిటివిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.