YSRCP politics : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతల పరిస్థితి ఏమంత బాగాలేదు. వారి భవిష్యత్తుపై పెద్దగా అంచనాలు లేకుండా పోతున్నాయి. వారికి భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా కాపు నేతల పరిస్థితి వింతగా ఉంది. కానీ వారితోనే రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమి వచ్చిన తర్వాత వారిని ఒక రక్షణ వలయంగా మార్చుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వారికి నియోజకవర్గాల కేటాయింపు, స్థానికంగా రాజకీయ ప్రాధాన్యం లేదు. అటువంటి వారిలో గుడివాడ అమర్నాథ్ ఒకరు ఉన్నారు. జగన్ పై విమర్శలు వస్తే ఇట్టే మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పై ఈగ వాలనివ్వరు. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయనకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. పేరుకే చోడవరం ఇంచార్జ్ కానీ.. అక్కడ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అనుచరులు అస్సలు సహకరించడం లేదు. అందుకే చోడవరంలో సొంత ఇంటి నిర్మాణం పై దృష్టిపెట్టారు గుడివాడ అమర్నాథ్.
* సుదీర్ఘ నేపథ్యం..
కాపు సామాజిక వర్గ ప్రముఖుల్లో గుడివాడ కుటుంబం ఒకటి. అమర్నాథ్ తాత గుడివాడ అప్పన్న, ఆయన తండ్రి గురునాధరావు రాజకీయాల్లో రాణించారు. వారి వారసుడిగా వచ్చిన అమర్నాథ్ తెలుగుదేశం పార్టీలో చాలా ఏళ్ల పాటు ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అమర్నాథ్ ఓడిపోయారు. 2019లో మాత్రం అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు అనకాపల్లి టికెట్ ఇచ్చేందుకు విముఖత చూపారు. చివరి నిమిషంలో గాజువాక నుంచి పోటీ చేయించారు. టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు గుడివాడ. అలాగని ఎన్నికల ఫలితాల తర్వాత గుడివాడకు గాజువాక నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి.
* భీమిలి ఇస్తారనుకుంటే..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా ఉన్న అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు తనకు ఇవ్వాలని గుడివాడ అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ జగన్ అందుకు అంగీకరించలేదు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును భీమిలి బాధ్యతలు ఇచ్చారు జగన్. గుడివాడ అమర్నాథ్ ను తీసుకొచ్చి గ్రామీణ నియోజకవర్గమైన చోడవరం ను అప్పగించారు. అక్కడ ఇన్చార్జిగా ఉన్న కరణం ధర్మశ్రీని ఎలమంచిలికి పంపించారు. అయితే ధర్మ శ్రీ సైతం కాపు సామాజిక వర్గం నేత. గుడివాడ అమర్నాథ్ నియామకాన్ని ఆయన వ్యతిరేకించారు. కానీ జగన్ పై ఉన్న గౌరవంతో మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ గుడివాడ అమర్నాథ్ కు క్యాడర్ సహకరించడం లేదు. గతంలో చోడవరం నుంచి ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహించడంతో ఆయన వస్తారని క్యాడర్ నమ్మకం పెట్టుకుంది. దీంతో ఉన్న ఒక్కగానొక్క నియోజకవర్గ కూడా గుడివాడ అమర్నాథ్ కు ఇబ్బందికరంగా మారింది.
