Pawan Kalyan health update : పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజాలకు సంబంధించిన బాధతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న ఆయన ముంబై లోనే ధీరుభాయి అంబానీ హాస్పిటల్ కి చేరుకొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. భుజాలకు జరిగిన గాయం తీవ్ర రూపం దాల్చిందని , వెంటనే సర్జరీ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి పొలిటికల్ షెడ్యూల్స్ కొన్ని కమిట్ అయ్యి ఉన్నానని , వాటిని పూర్తి చేసుకున్న వెంటనే సర్జరీ చేయించుకుంటానని చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా జనసేన పార్టీ హ్యాండిల్స్ ద్వారా అధికారికంగా చెప్పడంతో అభిమానులు కాస్త కంగారుకి గురయ్యారు. వారిలో పవన్ కళ్యాణ్ భక్తుడు , ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు . కాసేపటి క్రితమే ఆయన విషయం పై చింతిస్తూ ట్విట్టర్ లో వేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘నిన్న రాత్రంతా నాకు నిద్ర లేదు , నా బుర్రలో ఒకటే ఆలోచన, దాదాపుగా 15 ఏళ్ళ నుండి మీరు నడుము , భుజం నొప్పులతో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటేనే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మేమంతా విలవిలలాడిపోతుంటాము, అలాంటిది మీరు ఇంతటి బాధని చిరు నవ్వు వెనుక దాచి జీవించడం నిజంగానే అసాధారణమైన విషయం. నాకు ఈరోజు గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ రోజులు ఒక్కసారిగా కళ్ళముందు ఫ్లాష్ అవుతున్నాయి. గుజరాత్ లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుండి ఆరోజు మీరు పడిపోయిన క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం , ఇవన్నీ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి . ఆ సమయం లో మీరు మాటకు ప్రాణం ఇచ్చే మహా మనిషి లాంటి నిర్ణయం తీసుకున్నారు’.
‘ముందు ఈ సినిమాని పూర్తి చేద్దాం , నిర్మాతకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు , ఇన్ని వందల మంది రేయింబవళ్లు కష్టపడుతున్నారు ‘ అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లోనే దాచుకొని, ఆపరేషన్ వాయిదా వేసి , సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా మీరు నాకు ఇచ్చింది కేవలం ఒక సూపర్ హిట్ సినిమాని మాత్రమే కాదు , జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేని రుణాన్ని ఇచ్చారు. ఆ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలు అవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో , కానీ ఈరోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థం అవుతోంది’ అంటూ బండ్ల గణేష్ చాలా ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

