The Paradise: నేచురల్ స్టార్ నాని డ్రీం ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 21 న విడుదల చెయ్యాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు బయ్యర్స్ కి అధికారికంగా సమాచారం ఇచ్చింది మూవీ టీం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుకొచ్చారట. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు , ఆ తర్వాత జూన్ నెలకు షిఫ్ట్ అయ్యింది. అప్పటికి కూడా షూటింగ్ పూర్తి కాకపోవడం తో ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఈ తేదీన కూడా ఈ చిత్రం రావడం లేదని గత కొంతకాలంగా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం జరిగింది . దీన్ని మూవీ టీం చాలా గట్టిగానే ఖండించింది. కానీ చివరికి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజమైంది. అభిమానులు ఇలా ఈ చిత్రం తరుచు వాయిదా పడడంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చెయ్యాలా?, లేదంటే డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే ఈసారి ఒక విడుదల తేదీని ప్రకటిస్తే , మళ్లీ వాయిదా వేసే పరిస్థితులు ఉండకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరోపక్క నాని కూడా ఈ సినిమా ఆలస్యం అవుతుండడం పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పై తీవ్రమైన అసహనం తో ఉన్నారట. వాస్తవానికి అయితే ఆయన ఈపాటికి సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కబోయే ‘బ్లడీ రోమియో’ మూవీ షూటింగ్ లో ఉండాలి. అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే ‘బ్లడీ రోమియో’ చిత్రం ఈపాటికి 30 శాతం షూటింగ్ పూర్తి అయ్యి ఉండేది. కానీ ‘ది ప్యారడైజ్’ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వకపోవడం తో , ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది.
దీంతో డైరెక్టర్ సుజిత్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని పూర్తిగా ‘ఓజీ 2’ వైపుకి షిఫ్ట్ చేశారు. నవంబర్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇలా ‘ది ప్యారడైజ్’ కారణంగా ఆయన ఏకంగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని వదులుకోవాల్సి వచ్చింది. తీసిన సన్నివేశాలని రిపీట్ గా రీ షూట్స్ చేయడం , సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ బౌండెడ్ గా లేకపోవడం వల్లే, ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం అట. అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా 70 రోజుల సమయం పడుతుందట. అసలు ఈ ఏడాది విడుదల అవ్వడం అసాధ్యమే అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
