అదేంటో.. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూనకం వచ్చినట్లే అవుతుందేమో. రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడాల్సిన సీఎం.. దేశ రాజకీయాల అంశాన్ని తెరమీదకు తెస్తుంటారు. రాష్ట్రంలో ఓ వైపు గ్రేటర్ ఎన్నికల సీజన్ నడుస్తుంటే.. బహిరంగ సభ పెట్టిన కేసీఆర్ మరోసారి పీఎం మోడీని టార్గెట్ చేశారు. గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా నిన్న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభా వేదికగా.. కేసీఆర్ మాట్లాడారు.
Also Read: ఒక్క బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంతమంది వస్తారా?: కేసీఆర్
*ఓటర్లకు ఫజిల్
నాయకుల ఆలోచనలు, పనితీరు చూసి ఓటు వేయాలని హైదరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలని కోరారు. ‘సందర్భాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. ఎవరెవరి వైఖరి ఎలా ఉంది అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉండదు. రాజకీయ పార్టీగా పని చేస్తుందని గతంలోనే చెప్పాను. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్కరు మా బిడ్డే అని ఎప్పుడో చెప్పాం. గత ఏడేళ్లలో ఎలాంటి వివక్ష లేకుండా పాలన చేశాం. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరెంట్ బాధలు తీర్చాం’ అని చెప్పుకొచ్చారు. ‘హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరం. ఈ నగరానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణ సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేశాం. తెలంగాణ వాళ్లు రాష్ట్రాన్ని పరిపాలించలేరని అవహేళన చేశారు. రాష్ట్రం అంధకారం అవుతుందని మాట్లాడారు. నక్సలైట్లు చెలరేగుతారని కొందరు శాపాలు పెట్టారు. టీఆర్ఎస్ని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు. భారత దేశమే ఆశ్చర్యపోయే సభలు తెలంగాణలో జరిగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దేశంలో ఏ మూలనుంచి వచ్చినా వారిని ఆదరించాం. కేవలం 7 నెలల సమయంలోనే కరెంట్ కష్టాలు తీర్చాం. దేశ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్. హైదరాబాద్ ఖాళీ అవుతుందని కొందరు ప్రచారం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. ఐదేళ్లలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం అని చెప్పాం. టీఆర్ఎస్ మగతనం ఉన్న పార్టీ. టీఆర్ఎస్ ఏనాడూ పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు.’’ కేసీఆర్ అన్నారు.
*కేంద్ర మంత్రులకు చురకలు..
హైదరాబాద్‌కు కేంద్రమంత్రులు వరదల్లా వస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఒక బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంత మంది వస్తారా?, దేశం కోసం, ప్రజల మంచి కోసం మాట్లాడటం తప్పా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘ఈ దేశం గతి మార్చాలి.. జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారానే సందేశమివ్వాలి. 30 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? బీహెచ్ఈఎల్, రైల్వేలను, బీఎస్ఎన్ఎల్ను ఎందుకు అమ్ముతున్నారు? యూపీలోనే సక్కగ లేదు, ఆ రాష్ట్ర సీఎం వచ్చి మనకు చెప్తాడా? 28వ ర్యాంకర్ వచ్చి 5వ ర్యాంకర్‌కు చెబుతాడా? బీపాస్ కావాలా?.. కర్ఫ్యూ పాస్ కావాలో ఆలోచించండి. హైదరాబాద్‌కు పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయి. వంచకులు, మోసగాళ్ల జిమ్మిక్కులకు మోసపోవద్దు. రెచ్చగొట్టే మాటలు నమ్మి ఆగం కావొద్దు. భూముల విలువలు, వ్యాపారాలు పోతాయి జాగ్రత్త. గతం కంటే ఐదారు సీట్లు ఎక్కువ గెలిపించాలి. కేంద్రం మెడలు వంచి డబ్బులు తెచ్చి అభివృద్ధి చేస్తాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
Also Read: ఏపీ, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రారంభమైన ఆ రైలు..?
*కేంద్రంపై ఫైర్
‘దేశంలో వరదలు రాని నగరమే లేదు. ముంబయిలో 10 నుంచి 15 రోజులు, చెన్నైలో 21 రోజులు వరద నీరు నిలిచిపోయింది. బెంగళూరు, ఢిల్లీ, కోల్కత్తా, అహ్మదాబాద్‌లోనూ వరదలు వచ్చాయి. హైదరాబాద్‌లో వచ్చిన వరదలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మోకాలిలోతు నీటిలో తిరిగారు. ప్రజల బాధలు చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎవరూ నన్ను అడగకపోయినా ఒక్కోకుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించాం. చరిత్రలో ఇలా ఎవరూ ఇవ్వలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా నగరంలోని 6.50 లక్షల కుటుంబాలకు ర.650 కోట్లు అందించింది కేసీఆర్ ప్రభుత్వమే. వరదతలపై రూ.1350 కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరితే.. 13 పైసలు కూడా ఇవ్వలేదు. మేం దేశంలో లేమా..? బెంగళూరు, అహ్మదాబాద్‌కు ఇవ్వలేదా..? మేమేం తప్పు చేశాం..? ఎవరికి కర్రుకాల్చి వాత పెట్టి బుద్ధి చెప్పాలో నిర్ణయించుకోండి. వరద సాయం ఇవ్వలేదు కానీ.. రాష్ట్రానికి వరదలా వస్తున్నారు. ఇవి మున్సిపల్ ఎన్నికలా.. జాతీయ ఎన్నికలా..? దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వస్తారా..?’ అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు.
*మరోసారి ఢిల్లీ పల్లవి ఎత్తుకున్న కేసీఆర్
తన ప్రసంగంలో కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టారు. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమయ్యాయని అన్న ఆయన.. సరైన విద్య, వైద్యం ఎందుకు అందించడం లేదంటూ నిలదీశారు. ఇంకా ఎందుకు ఆకలి బాధలు ఉన్నాయని అన్నారు. ఇళ్లులేని పేదలు ఇంకా ఎందుకు ఉన్నారంటూ నిలదీశారు. మూస రాజకీయం పోవాలి.. కొత్త ఆవిష్కరణలు జరగాలి. నేను ఇలా అంటుంటే ఢిల్లీలో ఎందుకు గజగజ వణుకుతారు..? నగర చైతన్యాన్ని దేశానికి విస్తరించాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా ఆ సందేశం ఇవ్వాలి’ అంటూ పిలుపునిచ్చారు.
*కనిపించని హరీశన్న..
టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న మంత్రి హరీశ్‌రావు.. ఈ భారీ బహిరంగ సభకు హాజరు కాలేదు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యత మొత్తాన్ని హరీశ్ తన భుజాన వేసుకున్నారు. తన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించారు. కానీ.. చివరకు అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. దీంతో ఆ ఓటమికి తానే బాధ్యుడినంటూ హరీశ్ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఆయన పెద్దగా కనిపించడం లేదు. ఓ వైపు గ్రేటర్లో హోరాహోరీ పోటీ కనిపిస్తున్నా.. ఎక్కడా ప్రచారంలోకి కూడా రాలేదు. ఏ గల్లీలోనూ ప్రచారం చేయడం లేదు. అంతేకాదు.. నిన్న నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ హరీశ్ కనిపించలేదు. దీనిపై ఆయన అభిమానులు నిరుత్సాహ పడడమే కాకుండా.. హరీశన్న ఏమయ్యాడని చర్చ పెట్టారు.
Also Read: సొంత నియోజకవర్గాన్ని కాదని రాజాసింగ్ వేరే చోట పర్యటనలేంటి..?
*థర్డ్ ఫ్రంట్ అంటూ ఇప్పటికే బోల్తా పడినా..
ఆద్యంతం కేసీఆర్ స్పీచ్ విన్న సగటు ఓటర్లలో ఒకటే అనుమానం మొదలైంది. కేసీఆర్ నోట మళ్లీ ఢిల్లీ మాట రావడంతో ఖంగుతిన్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల సమయంలో థర్డ్ ఫ్రంట్ అంటూ దేశంలోని ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేసి కేసీఆర్ విఫలమయ్యారు. ప్రధాని మోడీపై వ్యతిరేకతతో ఉన్న సీఎంలను కేసీఆర్ కలిశారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని తలిచారు. కానీ.. ఆ ఎన్నికల్లో మోడీ తిరుగులేని విజయం సాధించారు. ఇతర పార్టీల మద్దతు లేకుండానే.. కేవలం ఎన్డీయే కూటమితోనే సంపూర్ణ మెజార్టీ సాధించారు. రెండో సారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించారు. అప్పటి నుంచి చాలా రోజులపాటు కేసీఆర్ సైలెంట్ అయ్యారు.
*కరోనా టైంలో క్లాప్స్ కొట్టి.. ఇప్పుడు కత్తులు నూరి
సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ప్రధాని మోడీపై విమర్శలు చేసిన కేసీఆర్.. తర్వాతి ఫలితాలతో థర్డ్ ఫ్రంట్ ఊసే లేకుండా మరిచారు. ఆ తర్వాత గత మార్చి నెల నుంచి దేశాన్ని కరోనా వైరస్ ఆవహించింది. దీంతో దేశమంతా వైరస్ బారిన పడిన వారి సంఖ్య లక్షలకు చేరుకుంది. ఆ ప్రభావం రాష్ట్రాల మీదా పడింది. దీంతో ప్రధాని మోడీ రాష్ట్రాల సీఎంలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు. తగిన సహాయం అందించారు. అయితే.. ఆ సందర్భంలో పీఎం సేవలను కేసీఆర్ సైతం కొనియాడారు. వైద్యుల సేవలను గుర్తించి క్లాప్స్ కొట్టమంటే క్లాప్స్ సైతం కొట్టారు. తర్వాత లైట్లు వెలిగించారు. ఇక ఇప్పుడు ఏమైందో ఏమో కానీ మరోసారి మోడీ పై కత్తులు నూరుతున్నారు. ఇదంతా ఇటీవల రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు రిలీజ్ చేయకపోవడంతో అప్పటి నుంచే ఈ అక్కసు మొదలైనట్లు పలువురు అంటున్నారు. మరోవైపు.. దుబ్బాక ఉప ఎన్నికతో బీజేపీ సైతం రాష్ట్రంలో బలపడింది. దీంతో బీజేపీని ఇక్కడ ఎదగకుండా అడ్డుకునేందుకు కేంద్రాన్ని టార్గెట్ చేశారని టాక్. కేసీఆర్ తాజా వ్యాఖ్యలతో మరోసారి ఢిల్లీ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధపడుతున్నట్లే కనిపించింది.
*పీఎం టూర్‌కు కేసీఆర్‌కు నో పర్మిషన్
మరోవైపు.. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ పరిశీలనకు శనివారం మోడీ హైదరాబాద్ వచ్చారు. కానీ.. ఈ టూర్‌కు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇందులో హకీంపేట్ ఎయిర్ ఆసిఫ్ చీఫ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికేందుకు రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అవాక్కయింది. కేసీఆర్‌లో కూడా కోపం పెరిగినట్లైంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
*మరోసారి ఛాలెంజ్..
గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగాలేదని ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు చెబుతున్నా.. కేసీఆర్‌లో మాత్రం ధీమా పోవడం లేదు. పోయిన సారి 99 సీట్లు గెలుచుకుంటే.. ఈసారి వాటికి అదనంగా మరో మూడు సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. భాగ్యనగరంలో గెలిచి జాతీయ స్థాయి రాజకీయాలకు తెరతీస్తామని సవాల్ విసిరారు. మొత్తంగా చూస్తే.. గ్రేటర్ ఎన్నికల్లో సత్తాచాటి భారీ మెజార్టీ సాధించి తన కొడుకుకు సీఎం పీఠం అప్పజెప్పాలని కేసీఆర్ ప్లాన్‌గా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొడుకు చేతిలో రాష్ట్ర పగ్గాలు పెట్టి.. కేసీఆర్ హస్తిన బాట పట్టాలని చూస్తున్నారని అంటున్నారు.
-శ్రీనివాస్.బి
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Kcr once again took over delhi politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com