CM Revanth Reddy: తెలంగాణలో రైతు భరోసా పథకం సరిగ్గా అమలు కాలేదని.. రుణాల మాఫీ కూడా సక్రమంగా జరగలేదని యూట్యూబ్ జర్నలిస్ట్ రేవతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఓ రైతుతో బూతుల మాటలతో విమర్శించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ వీడియో అత్యంత జుగుప్సాకారంగా ఉంది. వినడానికి సహించలేని రీతిలో ఆ భాష ఉంది. దీంతో ప్రభుత్వం ఆ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించింది. అంతేకాదు సదరు యూట్యూబ్ జర్నలిస్ట్ రేవతిని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆమె జ్యూడిషియల్ కస్టడీలో ఉంది. రేవతి వ్యవహారాన్ని భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. జర్నలిస్టులకు వ్యతిరేకంగా పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించడం మొదలుపెట్టింది.. హరీష్ రావు, కవిత, కేటీఆర్ వంటి వారు రేవతి విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతాలలో ప్రస్తావించడం విశేషం.
శాసనసభలో మాస్ వార్నింగ్
ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా తనను విమర్శిస్తున్న వారికి.. తనను మాత్రమే టార్గెట్ చేసుకొని కొంతమంది వ్యక్తులతో బూతు మాటలు మాట్లాడిస్తున్న వారికి రేవంత్ రెడ్డి సీరియస్ హెచ్చరికలు చేశారు. ” కడుపుకు అన్నం తింటున్న వాడు ఎవడైనా అలాంటి మాటలు సహిస్తాడా అధ్యక్షా? అలాంటి మాటలను వీరు తమ డొమైన్లలో పోస్ట్ చేయవచ్చా అధ్యక్షా? ఒక జర్నలిస్ట్ అలాంటి బూతు మాటలు విని.. వాటిని రికార్డు చేసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం ఎటువంటి విలువలకు నిదర్శనం? ఇలాంటి పైశాచిక ఆనందం దేనికి సంకేతం? తెలంగాణ సమాజం ఇటువంటి వాటిని ఆమోదిస్తుందా? అసలు తెలంగాణ ఉద్యమం నాడు కూడా ఇలాంటి దారుణాలు జరగలేదు కదా? ఈ సభ ద్వారా చంద్రశేఖర రావుకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా.. నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా.. బూతులతో తిట్టించాలని చూసినా ఇకపై ఊరుకునేది లేదు. చట్టంపై గౌరవమున్న వ్యక్తిగా.. రాజ్యాంగంపై సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా.. నేను మా యువకులను సముదాయిస్తున్నా. నాకు ఓపిక నశించిపోతే వాళ్ళందరూ వచ్చి బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి కొడతారని హెచ్చరిస్తున్నా. పదవి ఉన్ననాళ్లు ఉంటుంది. కానీ ఆ పదవిలో ఉన్నన్ని రోజులు ఎలా ఉన్నామనేది నేను చూస్తాను. కొంతమంది వ్యక్తులతో కలిసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కేసీఆర్.. తన తీరు మార్చుకోవాలి. ఇలానే వ్యవహరిస్తే చట్టాలను కూడా సవరిస్తామని.. అవసరమైతే కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమని” రేవంత్ హెచ్చరించారు.. శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన భారత రాష్ట్ర సమితి నాయకులకు గట్టి హెచ్చరికలు పంపారు.