AI job cuts layoffs: ఆర్థిక మాంద్యం, నైపుణ్యం కొరత, ఖర్చుల తగ్గింపు పేరుతో మూడేళ్లుగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తున్నాయి. దీంతో ఐటీ సంక్షోభం లక్షల మంది ఉద్యోగులపై పడుతోంది. తాజాగా గడిచిన ఆరు నెలల్లోనే లక్షల మందిని పలు కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇది ఉద్యోగులలో ఆందోళన రేకెత్తిస్తోంది. గత ఏడాది ఆర్థిక మాంద్యం భయాల మధ్య లక్షలాది ఉద్యోగాలను తొలగించిన ఈ సంస్థలు, ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను
విస్తృతంగా అవలంబించేందుకు మరోసారి ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి.
Tech layoffs 2025: ఏఐతో కొత్త ముప్పు..
టెక్ రంగంలో కృత్రిమ మేధస్సు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, అనేక సంస్థలు ఆటోమేషన్ ద్వారా వ్యయాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐబీఎం వంటి కంపెనీలు మానవ వనరుల విభాగంలో దాదాపు 8 వేల మందిని తొలగించి, 200 మంది హెచ్‌ఆర్ ఉద్యోగుల స్థానంలో ఏఐ వ్యవస్థలను ప్రవేశపెట్టాయి. ఈ ధోరణి ఇతర సంస్థల్లోనూ కనిపిస్తోంది, ఇది భవిష్యత్తులో మరింత ఎక్కువ ఉద్యోగాలను ప్రభావితం చేయవచ్చు. ఏఐ సాంకేతికత సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ, ఇది ఉద్యోగ భద్రతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.
Also Read: బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు ఇవీ.. ఎలా అప్లై చేయాలంటే?
ప్రముఖ సంస్థల్లో లేఆఫ్‌ల సునామీ..
మైక్రోసాఫ్ట్: మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది నాలుగు దఫాలుగా లేఆఫ్‌లను ప్రకటించింది, మొత్తం 9,100 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 4%) తొలగించింది. ఎక్స్‌బాక్స్, గేమింగ్ విభాగాల్లో తాజా కోతలు జరిగాయి. గత ఏడాది 10 వేల మందిని తొలగించిన ఈ సంస్థ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ డెవలపర్‌లను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంది.
ఇంటెల్ : ఇంటెల్ కూడా తన పునర్వ్యవస్థీకరణలో భాగంగా 20% ఉద్యోగులను తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. జర్మనీలోని ఆటోమోటివ్ చిప్ యూనిట్ మూసివేత, హెడ్‌క్వార్టర్స్‌లో 100 మంది తొలగింపు ఇప్పటికే పూర్తయ్యాయి. చిప్ డిజైన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఈ కోతలు ఎక్కువగా ఉన్నాయి.
అమెజాన్: అమెజాన్ ఈ ఏడాది నాలుగు సార్లు లేఆఫ్‌లను ప్రకటించింది, కమ్యూనికేషన్, సర్వీసెస్, పాడ్‌కాస్ట్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. రాబోయే రోజుల్లో 14 వేల మంది మేనేజర్‌లను తొలగించే అవకాశం ఉందని సమాచారం.
Also Read: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. 27 వేల పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ సిద్ధం!
ఇతర సంస్థలు: గూగుల్, మెటా, ఇన్ఫోసిస్, హెచ్‌పీ, టిక్‌టాక్, ఓలా ఎలక్ట్రిక్, సేల్స్‌ఫోర్స్, బ్లూఆర్జిన్, సైమన్స్ గ్రూప్ వంటి సంస్థలు కూడా వేలాది మందిని తొలగించాయి. మెటా 3,600 మందిని, సైమన్స్ గ్రూప్ 5,600 మందిని తొలగించాయి.
లేఆఫ్‌ల వెనుక కారణాలు..
గత ఏడాది నుంచి కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, కంపెనీలను వ్యయ నియంత్రణ వైపు నడిపించింది. మానవ శ్రమ స్థానంలో ఏఐ వ్యవస్థలను అవలంబించడం వల్ల ఉద్యోగాలు తగ్గుతున్నాయి. కొత్త వ్యాపార వ్యూహాలు, ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ కారణంగా ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి. కొన్ని సంస్థలు పనితీరు లోపాలను కారణంగా చూపి ఉద్యోగులను తొలగిస్తున్నాయి.