Defense Land Controversy: అప్పట్లో విడుదలైన ఓ తెలుగు సినిమాలో.. తనికెళ్ల భరణి రవీంద్ర భారతిని, చార్మినార్, ట్యాంక్ బండ్ ను అమ్మకానికి పెడతాడు. ఇదంతా నాదేనని.. ఇంత ఆస్తి నాకెందుకని అమ్ముతున్నానని అంటాడు. కొన్ని వ్యక్తికి అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవని తెలియకపోవడంతో కొంటానని చెబుతాడు. దానికి డబ్బు కూడా చెల్లిస్తాడు. డబ్బు చెల్లించిన తర్వాత చార్మినార్ స్వాధీనం చేసుకోవడానికి వెళ్తే అధికారులు అడ్డుకుంటారు. రవీంద్ర భారతి దగ్గరికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తే అక్కడి అధికారులు పిచ్చివాడి మాదిరిగా చూస్తుంటారు. వాస్తవానికి ఇది కామెడీ సన్నివేశం అయినప్పటికీ.. అప్పట్లో చాలామందికి కనెక్ట్ అయింది. ఇప్పటికీ యూట్యూబ్ లో కనుక చూస్తూ ఉంటే చాలామంది అదే పనిగా నవ్వుతుంటారు.. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకు అనే కదా మీ ప్రశ్న.. అయితే ఈ కథనం చదివేయండి మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది..
Also Read: Indus Water Treaty: సిందూ ఒప్పందం.. భారత్‌కు చెలగాటం.. పాకిస్తాన్‌కు ప్రాణసంకటం
మనదేశంలో ఆర్మీలో పని చేసే వారిలో ఎక్కువగా పంజాబ్ వాళ్ళు ఉంటారు. పంజాబ్ మనకు అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇది ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ కు దగ్గర్లో ఉంటుంది. పంజాబ్ నుంచి మనదేశంలో త్రివిధ దళాలలో పనిచేసే వారు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ యువకులకు సహజంగానే దేశభక్తి అధికంగా ఉంటుంది. మరోవైపు స్వాతంత్ర్య ఉద్యమంలో పంజాబ్ నుంచి చాలామంది పాల్గొన్నారు. చాలామంది ప్రాణ త్యాగాలు కూడా చేశారు. అందువల్లే పంజాబ్ రాష్ట్రాన్ని వీరులగడ్డ అని పిలుస్తుంటారు. అయితే అటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఓ తల్లి కొడుకులు చేసిన పని ఆ ప్రాంతానికి కళంకం తీసుకొచ్చింది.
పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్ కి సమీపంలో ఫట్టువాలా అనే ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఒక రన్ వే ఉంది. దీనిని ఉషా అన్సాల్, నవీన్ చంద్ అనే తల్లి కొడుకులు 1997లో ఇతరులకు విక్రయించారు. ఆ తర్వాత ఈ స్థలం అనేక మంది చేతులు మారింది. అయితే ఈ స్థలానికి సంబంధించి రెవెన్యూ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగి నిషాన్ సింగ్ ఒక కీలకమైన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఉష, నవీన్ నకిలీ పత్రాలు సృష్టించి ఆ రన్ వే ను విక్రయించినట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ రన్ వే ను ఉపయోగించడానికి లేకుండా పోయింది.. అయితే ఈ భూమికి సంబంధించి వివాదం ఉన్న నేపథ్యంలో గడిచిన నెలలో కోర్టు జోక్యం చేసుకుంది. కోర్టు తీర్పు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అనుకూలంగా వచ్చింది. దీంతో ఈ రన్ వే ను స్వాధీనం చేసుకుంది. నకిలీ పత్రాలతో రన్ వే ను విక్రయించిన నవీన్, ఉషపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
రన్ వే విక్రయించడానికి కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా తెర వెనుక పాత్ర పోషించారని తెలుస్తోంది. వారంతా కూడా తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించడంలో సహాయం చేశారని సమాచారం. వారి వల్లే నవీన్, ఉష రన్ వే ను ఇతర వ్యక్తులకు విక్రయించినట్లు సమాచారం. అయితే బహిరంగ మార్కెట్లో దీని విలువ అధికంగా ఉంటుందని.. పైగా ఇది మన దేశానికి అత్యంత కీలకమైన రన్ వే కావడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరఫు న్యాయవాది కోర్టులో గట్టిగా వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది.