Telangana BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలు ఎట్టకేలకు నిర్వహించారు. కొత్త సారధిగా మాజీ ఎమ్మెల్యే ఎన్.రామచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సీనియర్ నాయకులు రామచందర్‌రావును అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. బీసీ నినాదం వేళ.. ఓసీ నేత తెలంగాణ సారథి కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరోవైపు కొత్త సారథికి పార్టీలో సరికొత్త సవాళ్లు ఎదురుకాబోతున్నాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ఎన్. రామచందర్‌రావు ముందు రాజకీయ సవాళ్లు, అవకాశాలతో కూడిన కీలక బాధ్యత ఉంది. రాష్ట్రంలో మూడు నెలల్లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాలను కొనసాగిస్తూ, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించాలన్న బీజేపీ అధిష్టానం ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉంది. పార్టీలోని అసంతృప్తులను సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో సంస్థాగత బలోపేతం చేయాల్సి ఉంది.
జోష్ కొనసాగించేనా..
ఎవరు అనువన్నా.. కాదనా‍్న.. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పార్టీకి గణనీయమైన మైలేజీ వచ్చింది. గణనీయమైన పురోగతి సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 సీటు సాధించిన బీజేపీ, 2023లో 8 అసెంబ్లీ సీట్లు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లతో 35.08% ఓటు షేర్‌ను సాధించింది. ఈ విజయాలను స్థానిక సంస్థల ఎన్నికలైన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించడం రామచందర్‌రావు ముందున్న తొలి సవాలు. ఈ ఎన్నికలు పార్టీ క్షేత్రస్థాయి బలానికి పరీక్ష. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ సందేశాన్ని విస్తృతంగా చేరవేయడం కీలకం. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతానికన్నా బలమైన ప్రదర్శన చేయడం రామచందర్‌రావు ఎదుర్కొనే మరో సవాల్.
అంతర్గత సమన్వయం కత్తిమీద సామే..
రామచందర్‌రావు నియామకం పార్టీలో కొంత వివాదానికి దారితీసింది. ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి నాయకులు అధ్యక్ష పదవికి ఆశించారు. అయితే రామచందర్‌రావును ఎంపిక చేయడం వెనుక అధిష్ఠానం ఆలోచన అతని అనుభవం, ఆర్‌ఎస్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలు, వివాదరహిత ఇమేజ్ కీలకంగా ఉన్నాయి. అయితే, రామచందర్‌రావుకు ఇప్పుడు అసంతృప్త నాయకులను కలుపుకొని, వివిధవర్గాల మధ్య సమతుల్యత సాధించడం అతిపెద్ద సవాల్. రాజాసింగ్ వంటి నాయకుల అసంతృప్తిని తగ్గించడం, ఈటల రాజేందర్ వంటి బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన సీనియర్ నాయకులను సమర్థవంతంగా వినియోగించుకోవడం నాయకత్వ నైపుణ్యానికి ఓ పరీక్ష.
సంస్థాగత బలోపేతం
రామచందర్‌రావు గతంలో సంఘటన పర్వ్ సభ్యత్వ డ్రైవ్‌లో కన్వీనర్‌గా పనిచేసి, తెలంగాణలో బీజేపీ సభ్యత్వాన్ని 12 లక్షల నుంచి 40 లక్షలకు పెంచారు. ఈ అనుభవం ఆయనకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఉపయోగపడనుంది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లతో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ఆధారాన్ని విస్తరించడం, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓబీసీ మోర్చా, ఏబీవీపీ వంటి విభాగాల ద్వారా ఆకర్షించడం అవసరం.
అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం..
2028లో తెలంగాణలో అధికారం సాధించాలన్న బీజేపీ అధిష్టానం లక్ష్యం రామచందర్‌రావుపై ఒత్తిడిని పెంచుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 65 సీట్లతో అధికారంలోకి రాగా, బీఆర్‌ఎస్ 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఈ రెండు పార్టీలను ఢీకొట్టి, రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి రావాలంటే, రామచందర్‌రావు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకులను చీల్చే వ్యూహాలను రూపొందించాలి. ఇందుకోసం, స్థానిక నాయకులను బలోపేతం చేయడం, హిందుత్వ ఎజెండాతోపాటు అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలను సమతుల్యం చేయడం అవసరం.
పొత్తులు, ఎత్తులు..
తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, బీఆర్‌ఎస్, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రామచందర్‌రావు నియామకం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో కుదిరితే పొత్తు పెట్టుకోవడం.. లేదంటే విపక్షాలను చిత్తు చేయాల్సిన ఎత్తులు వేయాల్సిన బాధ్యత రామచందర్‌రావుపై ఉంది. ఈ సమీకరణాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, స్థానిక స్థాయిలో పార్టీ బలాన్ని పెంచడంపై దృష్టి సారించాలి.