
సంసారం ఒక చదరంగమని.. కన్నీటి సంద్రమని.. కష్టాల ఊబి అని.. పాడుకునేవారికే కొదవలేదు. వీళ్లంతా.. ఒక్క భార్యను చేసుకొని, ఒక్క కుటుంబాన్ని సాకలేక ట్రాజెడీ సాంగ్స్ ప్లే చేసుకునేవాళ్లే. ఇద్దరు భార్యలను చేసుకొని బండి నడిపిస్తున్నవారు కూడా అక్కడక్కడా కనిపిస్తుంటారు. కానీ.. ఐదు, పది, పదిహేను అంటూ పెళ్లాల సంఖ్య పెంచుకుంటూ పోయాడో భార్యల బాహుబలి.
ఆయన పేరు జియానా చానా. మన దేశస్తుడే. మిజోరాం రాష్ట్రంలోని బక్తాంగ్ త్లాంగ్నుమ్ గ్రామస్తుడు. 1945 జులై 21న జన్మించిన ఆయన.. తనకు 17 ఏళ్ల వయసు రాగానే తొలిసారి పెళ్లి చేసుకున్నాడు. ఇక, ఆ తర్వాత నుంచి నంబర్ పెంచుతూ వెళ్లాడు. ఆ విధంగా.. మొత్తం 38 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇతగాడు ఏ ఉద్దేశంతో పెళ్లాల సంఖ్య పెంచుకుంటూ పోయాడో? వచ్చిన భార్యలు ఎలా అంగీకరించారో..? తెలియదుగానీ.. ప్రపంచంలోనే అత్యధిక మందిని పెళ్లి చేసుకున్న వ్యక్తిగా నిలిచాడు జియా చానా.
ఈయన ఏకంగా 89 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. కోడళ్లు, మనవళ్లు మనవరాళ్లు కలిసి ఇప్పటి వరకు 33 మంది అయ్యారు. జియానా చానా, ఆయన భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 160 మంది ఉన్నారు. వీరంతా కలిసే నివసిస్తున్నారు. 4 అంతస్తుల భవనంలో మొత్తం 100 గదులు ఉన్న ఇంట్లో వీరంతా ఉంటున్నారు. ఈ ఇంటికి ‘‘చుహాన్ తార్ రన్’’ అనే పేరు కూడా ఉంది. ఇక, వీళ్లందరికీ కలిపి ఒకే వంట గది. అందరూ కలిసి వంట పనిచేస్తారు. అందరూ కలిసే భోజనం చేస్తారు.
ఈ ఇంటిని చూడడానికి పర్యాటకులు వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ కుటుంబం కారణంగానే ఈ గ్రామం పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలను, ఈ ఇంటిని చుట్టి వెళ్తుంటారు చాలా మంది. ఇంత పెద్ద కుటుంబానికి ఆద్యుడైన చానా.. 81 ఏళ్ల వయసులో నిన్న (జూన్ 13) అనారోగ్యంతో కన్నుమూశాడు.
ఆయన మృతిపట్ల మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్ తంగ్ సైతం స్పందించారు. జియానా కుటుంబం ఫొటోను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. జియానా కారణంగానే బక్తాంగ్ గ్రామం పర్యాటక ప్రాంతంగా మారిందని అన్నారు. ‘రెస్ట్ ఇన్ పీస్ జియానా’ అని ట్వీట్ చేశారు సీఎం.