YSRCP Leadedrs: ‘వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు గోడదెబ్బ..చెంపదెబ్బ తప్పడం లేదు’ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కాకుంటే కష్టమని.. అటువంటి వారిని పక్కనపెడతామంటూ అధినేత జగన్ ముఖం మీదే చెబుతున్నారు. పోనీ ప్రజలను కలుస్తామంటే వారు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో తెలియని పరిస్థితి. వారి నుంచి ఒక్కోసారి బూతులు సైతం వినాల్సి వస్తోంది. నిలదీతలు, ప్రశ్నలతో అసలు మర్యాదే లేకుండా పోతుందన్నది వైసీపీ నేతల ఫీలింగ్. అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొత్త ఆలోచన చేస్తున్నారు. ప్రజల నోటి నుంచి సమస్యలు రాకుండా ఉండాలంటే వారి నోరుమూయిస్తే పోలే అన్న ఆలోచనకు వచ్చారు. సేమ్ ఎన్నికల ప్రచారం మాదిరిగా ఎదురెళ్లి చేతిలో తృణమా.. పణమో పెట్టి శాంతింపజేసే పనిలో పడ్డారు.తద్వారా వారి అభిమానం చూరగొన్నట్టు ఉంటుంది.. అటు అధిష్ఠానం ఆదేశాలు అమలుచేసినట్టుంటుంది అని ఒక్కొక్కరూ ఈ ఫార్ములాను అనుసరిస్తున్నారు. వర్కవుట్ అవుతుండడంతో అందరూ అనుసరించడం ప్రారంభించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట మొన్నటి వరకూ తిరుగులేదు. కానీ ఆయనకు అమాత్య పదవి పోయేసరికి అటు జనాలకు భయం లేదు. సహచర ఎమ్మెల్యేలు కలుపుకొని వెళ్లడం లేదు. పైగా వైవీ సుబ్బారెడ్డి రూపంలో ఆయనకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అటు అధిష్టాన పెద్దల అనుగ్రహం తగ్గుముఖం పడుతోంది. అటు పార్టీ కార్యక్రమాల్లోనూ బాగా వెనుకబడి పోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పార్టీ పక్కనపెడుతోందనన్న భయం వెంటాడుతోంది. దీంతో హైకమాండ్ ఆదేశించిన గడగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ నియోజకవర్గంలో పరిస్థితి ఏమంత బాగాలేదు. సొంత పార్టీలోనే అసంతృప్తివాదులు తనను ఎక్కడ నిలదీస్తారోనని బాలినేనికి నిద్రపట్టడం లేదు. అందుకే ఆయన కొత్త ఆలోచనలు చేశారు. కోట్ల రూపాయలతో వెండి సామగ్రి కొనుగోలు చేశారు. అనుచరులే ప్యాక్ చేయించారు. ఏ రోజు అయితే గడగడపకు వెళుతున్నారో.. అలా ఇంటికి వెళ్లే క్రమంలో ఆ ఇంటి యజమాని చేతిలో వెండి వస్తువును పెట్టేస్తున్నారు. దీంతో వారు ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఇస్తే.. ఎన్నికల్లో తమకు బంగారం ఇస్తారని స్థానికులు లెక్కలు వేసుకుంటున్నారు.

ఇప్పుడదే ఫార్ములాను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుసరిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పై గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన వంశీకి నియోజకవర్గంలో ఇతర వైసీపీ నాయకుల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ భరోసా లభించలేదు. అటు పార్టీ కార్యక్రమాల్లో సైతం వెనుకబడి ఉన్నారని నిఘా సంస్థలు హైకమాండ్ కు చెప్పాయి. ఇలా అయితే కష్టమని హైకమాండ్ సంకేతాలివ్వడంతో వంశీ నియోజకవర్గంలో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రజా వ్యతిరేకతతో పాటు సొంత పార్టీలో అసమ్మతి నేతలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని వంశీకి బెంగ వెంటాడుతోంది. దీంతో బాలినేని ఫార్ములాను తెరపైకి తెచ్చారు. అయితే నేరుగా అందిస్తే ఎక్కడ బయటపడుతుందోనని.. కవర్లో నగదు పెట్టి ప్రజలకు అందిస్తున్నారు. ప్రజలు నోరుతెరిచి సమస్యలు చెప్పేలోపే చేతిలో కవర్ పెడుతున్నారు. దీంతో ప్రజలు కూడా సైలెంట్ అవుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారని హైకమాండ్ ఇటీవల గుర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో కొందరు ప్రముఖ నాయకులు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తమపై ప్రజా వ్యతిరేకతనుతగ్గించుకునేందుకు ఏం చేయాలని కొందరు వ్యూహకర్తలను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు పర్యటించిన ప్రాంతాల్లో ప్రభుత్వ నిఘా వర్గాలు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ను హైకమాండ్ కు అందిస్తున్నాయి. అందుకే ఎక్కడా నిలదీతలు, ప్రశ్నలు ఎదురుకాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు తాయిలాలను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడే తాయిలాలు ప్రకటిస్తే ఎన్నికల ఖర్చు అమాంతం పెరిగిపోయే చాన్స్ ఉందని మిగతా ప్రజాప్రతినిధులు భయపడుతున్నారు.