YS Sharmila: నాలుగు రోజులుగా తెలంగాణలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్.షర్మిల ఎపిసోడ్ రాజకీయ వేడి పెంచింది. తన జోలికి వస్తే ఎలా ఉంటుందో చూపించాలనుకున్న షర్మిల ఏకంగా కేసీఆర్‌నే సవాల్ చేసింది. ఈ క్రమంలో పోలీసుల చర్యలతో సర్కార్‌పై వ్యతిరేకత, షర్మిలపై సానుభూతి పెరిగాయి. దీంతో ముఖ్యమంత్రి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం వరంగల్ సీపీ తరుణ్‌జోషిని తప్పించారు. అయినా షర్మిల వెనక్కి తగ్గలేదు ప్రభుత్వ అవినీతి, ప్రశ్నించినందుకు పోలీసులతో తనపై చేయించిన దాడిపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. దీంతో నాలుగు రోజులుగా షర్మిల ఎపిసోడే మీడియాలో ఫోకస్ అవుతోంది.

ఇదీ జరిగింది..
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన ఆరోపణలతో టీఆర్‌ఎస్ నాయకులు రెచ్చిపోయారు. షర్మిల కార్‌వ్యాన్‌కు నిప్పు పెట్టారు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాడిచేసినవారిని అరెస్ట్ చేయకుండా షర్మిలనే అక్కడి అరెస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా షర్మిలతోపాటు వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు పోలీసులతో నెరుగులాడారు. ఈ క్రమంలో షర్మిల పెదవులు, చిన్‌కు గాయమైంది. ఈ విషయంపై ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో విస్త్రృతంగా ప్రచారం చేశారు. ఇక హైదరాబాద్‌కు చేరుకున్న షర్మిల కారులో ప్రగతిభవన్‌కు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు కారులో షర్మిల కూర్చొని ఉండగానే క్రేన్ సాయంతో ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసైకి షర్మిల తాజాగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
గాయం.. మాయం..
పోలీసులతో పెనుగులాటలో షర్మిల ముఖానికి గాయమైందని రెండు రోజులు సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో ప్రసారమైంది. గురువారం గవర్నర్‌ను కలిసిన షర్మిల రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ముఖంపై ఎలాంటి గాయం కనిపించలేదు. ఈ విషయాన్ని నర్సంపపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా లేవనెత్తారు. రెండు రోజులకే గాయం మాయమైందా అని ఎద్దేవా చేశారు. అంత తొందరగా మానిపోయే చికిత్స అందుబాటులోకి వచ్చిందా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎక్కడ ట్రీట్‌మెంట్ చేయించుకున్నానరో మాకూ చెప్పండి అని కోరారు.

వ్యక్తిగతంగా ఎవరినీ అనలేదు..
కాగా, గవర్నర్‌ను కలిసిన తర్వాత షర్మిల కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా ఇప్పటి వరకు విమర్శించలేదన్నారు. అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నానని తెలిపారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అవినీతిని కూడా ప్రశ్నించాని తెలిపారు. ‘‘అయినా, ఆయన మగతనంతో నాకేం పని’’ అంటూ షర్మిల సంచలన కామెంట్లు చేశారు. ‘‘పెద్ది సుదర్శన్‌రెడ్డి.. మగతనం ఆమె భార్య కు తెలుస్తుంది, నాకేం అవసరం’’ అంటూ ఫైర్ అయ్యారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని తెలిపారు. మంత్రి నిరంజన్‌రెడ్డి తనను మరదలు అంటే దానికి బదులుగా తాను చెప్పుతో కొడతా అని దీటుగా జవాబిచ్చానని చెప్పారు. ఆయనంటే తప్పు లేదని, తానన్న మాటే తప్పా అని ప్రశ్నించారు. ఆయన కేసు పెడితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని, తాను కేసు పెడితే మాత్రం ఫైల్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాళ్లది రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ..
తెలంగాణలో మహిళలకు పాలకులు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. తాను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డను అని, తాను కేసు పెడితేనే పోలీసులు తీసుకోవడం లేదని, ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, టీఆర్‌ఎస్ నేతలపై సంచలన విమర్శలు గుప్పించిన షర్మిల టీఆర్‌ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని, దేశంలో కేసీఆర్ ది రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అని ఆరోపించారు.