Minister Malla Reddy: తెలంగాణలోకి సీబీఐ రావొద్దని ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జీవో 51 విడుదల చేసింది. దీంతో అదే సీబీఐ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఢిల్లీకి రప్పించుకుంది. ఇంకా కొంతమంది ఢిల్లీబాట పట్టనున్నట్లు సమాచారం. ఇక ఇంతటితో ఆగకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, ఈడీ తెలంగాణలో దూకుడు పెంచాయి. ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఈడీ ఫోకస్ చేసింది. మల్లారెడ్డిని ఐటీ టార్గెట్ చేసింది. ఇటీవలో మూడు రోజులు మల్లారెడ్డి ఆస్తులను సోదా చేసింది. అంతటితో ఆగకుండా విచారణకు పిలుస్తోంది.. ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడితో ఉన్న మంత్రికి ఐటీ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు సోదాలు – విచారణ చేసిన ఆదాయపు ఐటీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అందులో పేర్కొన్న అంశాలు మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇవ్వబోతున్నాయి.

వెంటాడుతున్న దర్యాప్తు సంస్థలు..
మంత్రి మల్లారెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలతో రాజకీయంగా కలకలం చోటు చేసుకుంది. మంత్రి నివాసంతో పాటుగా ఆయన బంధువుల నివాసాల్లోని ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాలు నిర్వహించారు. కుమార్తె – కుమారుడు– అల్లుడుతో పాటుగా బంధువుల నివాసాలు– కార్యాలయాల్లోనూ ఈ సోదాలు జరిగాయి. పెద్ద మొత్తంలో నగదును, బంగారంతో పాటుగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు మంత్రి కుటుంబాన్ని, సన్నిహితులు, కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని విచారిస్తున్నారు. కాగా, మల్లారెడ్డి సంస్థల్లో సోదాల సమయంలో తాము గుర్తించిన అక్రమాల పైన ఐటీ అధికారులు ఈడీకి లేఖ రాయటం కలకలం రేపుతోంది. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఫీజులు వసూలుపై ఐటీ షాకిచ్చింది. దీనికి సంబంధించి అక్రమాలు జరిగినట్లు ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది.
ఈడీ ఇన్‌ఫర్మేషన్..
మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో ప్రధానంగా ఫీజలు వసూలుపైనే అధికారులు ఫోకస్ పెట్టారు. అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ సమయంలోనూ ఆరా తీస్తున్నారు. దీంతో, మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఐటీ అధికారులు ఈడీకి లేఖ రాశాారని సమాచారం. మల్లారెడ్డి కుటుంబ సభ్యుల లాకర్లు నుంచి రూ.18 కోట్లు నగదు.. కీలక పత్రాల స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఫీజలు విషయంలో తాము కోరని సమాచారంపై స్పష్టత రాలేదని ఈడీకి రాసిన లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. దీని పైన ఈడీ మరింత లోతుగా విచారణ చేయటం ద్వారా మరిన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సూచించినట్లు సమాచారం. ఈ లేఖ పైన ఈడీ ఏ రకంగా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

సీట్లు – డొనేషన్లలో అవకతవకలు
మల్లారెడ్డి విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపు.. డొనేషన్ల స్వీకరణలో భారీగా అవకతవకలు జరిగాయనేది ఐటీ అధికారుల అభియోగం. దీనికి సంబంధించి కొంత సమాచారం సేకరించినా.. లోతైన అధ్యయనం అవసరమని భావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఐటీ అధికారుల లేఖ ఆధారంగా ఈడీ విచారణ చేయాల్సి ఉంటుంది. ఐటీ అధికారుల లేఖ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగేముందే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని టీఆర్‌ఎస్ నేతలే లక్ష్యంగా అనేక అంశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ సాగుతున్న సమయంలో.. తాజాగా మల్లారెడ్డికి సంబంధించి ఐటీ అధికారులు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఇప్పుడు మల్లారెడ్డి వ్యవహారంలో ఈడీ స్పందన ఏంటనేది చూడాలి.