YS Sharmila: ఏపీ సీఎం జగన్ పదేపదే తనకు మీడియా సపోర్ట్ లేదని చెబుతారు. తన చేతిలో ఏ మీడియా లేదని ప్రజలకు వివరిస్తుంటారు. కానీ ప్రజలందరికీ తెలుసు. సాక్షి అనే మీడియా జగన్ కుటుంబానిది అని తెలుసు.అయితే ఇప్పుడు సాక్షి ఒక్క జగన్ దేనా? ఆ కుటుంబంలో మిగతా సభ్యులకు వాటా ఉందా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. సాక్షిలో తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాక్షి మీడియాలో తనకు సైతం వాటా ఉందని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడడం విశేషం. సాక్షి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరిదని షర్మిల చెబుతున్న మాటలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాక్షి పత్రికను స్థాపించారు. ఇందిరా టెలివిజన్ పేరిట సాక్షి ఛానల్ ను తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బలమైన మద్దతుదారులుగా నిలవడంతో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు జగన్ తో ఇందిరా మీడియా పేరిట సాక్షి పత్రిక, చానల్ ను ఏర్పాటు చేశారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఏకంగా ఆయన ఫోటోతో కూడిన లోగోలను పత్రిక తో పాటు టీవీలో ప్రచురిస్తున్నారు. ప్రస్తుతం సాక్షి మీడియా వ్యవహారాలను జగన్ భార్య భారతీ రెడ్డి చూస్తున్నారు. అయితే ఇప్పుడు అదే సాక్షిలో ఇప్పుడు షర్మిలకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి.
షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతులు కాంగ్రెస్ అధినాయకత్వంతో ఎప్పుడో టచ్ లోకి వెళ్ళారని సాక్షి మీడియా వ్యతిరేక కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఉండేటప్పుడు సాక్షిలో కనీస ప్రాధాన్యత కూడా దక్కలేదు. అలాగని వ్యతిరేక కథనాలు రాలేదు. ఆమె ఎప్పుడైతే పిసిసి పగ్గాలు అందుకొని.. వైసిపి తో పాటు జగన్ టార్గెట్ చేసుకున్నారో.. నాటి నుంచి వ్యతిరేక కథనాలు ఏకధాటిగా వస్తున్నాయి. అందులో భాగంగా ప్రణబ్ ముఖర్జీని కలిసి బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించారని ప్రత్యేక కథనం వచ్చింది. దానిని షర్మిల ఖండించారు.
జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల కడపలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తనకు ఎప్పుడూ పదవీకాంక్ష లేదని.. ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. గతంలో సోనియా గాంధీ దగ్గరికి వెళ్లేటప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ భారతీ రెడ్డితో కలిసి వెళ్లేవారు మాత్రమేనని చెప్పుకొచ్చారు. జగన్ పత్రికలో అవాస్తవాలు రాయిస్తున్నారని ఆరోపించారు. ఆ మీడియాలో జగన్ కు ఎంత వాటా ఉందో.. తనకు అంతే ఉందన్న విషయం తెలుసుకోవాలన్నారు. తనపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మొత్తానికైతే సాక్షి మీడియాలో సైతం తనకు వాటాలు ఉన్నాయని చెప్పడం ద్వారా షర్మిల గట్టి హెచ్చరికలు పంపారు. దీనిపై లీగల్ పోరాటం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై షర్మిల తదుపరి స్టెప్ ఎలా వేస్తారో చూడాలి.